ఆశాజనకంగా కంది సాగు
జిల్లాలో 17,600 ఎకరాల్లో..
గాంధారి, నవంబర్ 13 : పప్పుదినుసు పంటల్లో ఒకటైన కంది పంటను సాగుచేసిన రైతుల పంట పండనున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాల్లో కందిసాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ.. సమృద్ధిగా వర్షాలు కురియడంతో కంది పంట బాగా పెరిగింది. సోయా, మక్కజొన్న, మినుము, పెసర తదితర పంటల్లో అంతర్ పంటగా సాగుచేసే కందిపంటను, ఈ సంవత్సరం జిల్లాలో 17,600 ఎకరాల్లో సాగుచేశారు. రైతులు సాగుచేసిన కంది పంటకు కాలం కలిసి రావడంతో అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేయడానికి గత సంవత్సరం మాదిరిగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
అంతర్ పంటగా కంది సాగు
నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిల్లాలో వానకాలంలోరైతులు ప్రధానంగా సోయా, మక్కజొన్న, పత్తి తదితర పంటలను సాగు చేస్తారు. సోయా, మక్కజొన్న పంటల్లో అంతర్పంటగా కంది పంటను సాగుచేస్తారు. సోయా, మక్కజొన్న పంటలు మూడు నెలల కాలవ్యవధిలోనే కోతకు రావడంతో.. రైతులు యాసంగిలో ఇతర పంటలను సాగు చేయకుండా కేవలం అంతరపంటగా సాగుచేసిన కందిపంటను సంరక్షిస్తారు. జూన్, జూలై నెలల్లో ప్రధాన పంటలతో పాటు విత్తుకున్న కంది పంట 160 నుంచి 180 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు కంది పంట ఏపుగా పెరిగి పూత దశలో ఉన్నది. గత ఏడాది కన్నా ఈ సారి కంది సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ.. కాలం అనుకూలించడంతో దిగుబడి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పంటతో నష్టం వాటిల్లినా..
రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయడంతో కొన్ని సందర్భాల్లో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. చాలా మంది రైతులు ఒకే రకమైన పంట సాగుకు బదులుగా ఏకకాలంలో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. సోయా, మక్కజొన్న, మినుము, పెసర పంటల్లో అంతర్ పంటగా కందిని సాగుచేస్తున్నారు. ఒక పంటకు నష్టం వాటిల్లినా.. మరో పంట చేతికి రావడంతో రైతు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
జిల్లాలో 17,600 ఎకరాల్లో సాగు..
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో కంది సాగు విస్తీర్ణం తగ్గింది. గతేడాది జిల్లాలో 23 వేల ఎకరాల్లో కంది పంటను సాగుచేయగా, ఈ ఏడాది 17,600 ఎకరాల్లో సాగుచేశారు. జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం, బాన్సువాడ, పెద్ద కొడప్గల్, రామారెడ్డి మండలాల్లో సోయా, మక్కజొన్న, మినుము, పెసర పంటల్లో అంతర్ పంటగా కందిని సాగు చేశారు. పంట బాగా పెరగడం, ఈ సంవత్సరం కంది పంటకు క్వింటాలుకు రూ.6,300 మద్దతు ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.