పన్నెండేండ్లుగా అభాగ్యులకు సేవలు
రెండు శాశ్వత సేవా కార్యక్రమాలు
పర్యావరణపై అవగాహన కార్యక్రమాలు
నేత్ర వైద్యంపై ప్రత్యేక దృష్టి
ప్రతి ఏటా జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులు
పిట్లం, నవంబర్ 13: ఎంత సంపాదించినా అందులో కొంత సమాజానికి వినియోగిస్తేనే సంపాదించిన దానికి సార్థకత ఉంటుంది. సమాజంలో ఎందరో అభాగ్యులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి చేతనైనంత సహాయం అందిస్తే కొంతైనా మేలు చేసిన వారవుతారు. అలాంటి అభాగ్యులను గుర్తించి చేయూతను అందిస్తున్నారు పిట్లం లయన్స్ క్లబ్ సభ్యులు. 12 ఏండ్ల క్రితం ప్రారంభమైన పిట్లం లయిన్స్ క్లబ్.. గ్రామీణస్థాయిలో అనేక రకాల సేవలను అందిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలుమార్లు ఉత్తమ అవార్డులను అందుకున్నారు. వైద్యం, పర్యావరణం, రక్తదాన శిబిరాలు, మహిళలకు వృత్తి విద్యా కోర్సులు, అనాథాశ్రమ నిర్వహణ, కరోనా నుంచి కోలుకున్న రోగులకు నిత్యావసర వస్తువుల సరఫరా వంటి కార్యక్రమాలు చేపడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
సేవే లక్ష్యంగా ముందుకు..
సమాజంలో అభాగ్యులకు సేవ చేయడమే లక్ష్యంగా 2007 జనవరిలో పిట్లం లయన్స్‌క్లబ్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో ప్రధానంగా నేత్రవైద్య శిబిరాలకు పరిమితమైన క్లబ్.. అనంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ప్రధానంగా అగ్నిప్రమాద బాధితులకు తాత్కాలిక సహాయం, పంచాయతీ కార్మికులకు దుప్పట్లు, దుస్తుల పంపిణీ, చలికాలంలో అనాథలకు రగ్గుల పంపిణీ, విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలతో పాటు సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో డ్యూయల్ డెస్క్‌ల అందజేత, అనాథ, పేద పిల్లలకు పై చదువుల కోసం ఆర్థిక సహాయం, రక్తదాన, నేత్ర వైద్య శిబిరాలు, క్రీడాకారులకు ప్రోత్సాహక కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మొక్కలు నాటడం, స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాల్లో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా పది సంవత్సరాల నుంచి మండల కేంద్రంలో మట్టి గణపతులను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
శాశ్వత సేవా కార్యక్రమాలు..
పిట్లం లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాశ్వత సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆరేండ్ల నుంచి అనాథ పిల్లలకు కోసం ఆశ్రమం నిర్వహిస్తున్నారు. పది మంది చిన్నారులను ఆశ్రమంలో ఉంచి వారికి వసతి కల్పించి చదువు చెప్పించడంతో పాటు వారికి కావాల్సిన అవసరాలను తీర్చుతూ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారు స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నారు.