నిజామాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపార రంగంలో వెనుకబడిన వారు రాణించాలనే ఉద్దేశంతో మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో 30శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15శాతం చొప్పున దుకాణాలను కేటాయించింది. మద్యం వ్యాపారంలో వారికి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటారని సర్కారు యోచించింది. ఇదిలా ఉండగా కొన్ని దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో రాజ్యమేలుతున్న వ్యాపారులు కుట్రలకు దిగుతున్నారు. లక్కీ డ్రాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు వచ్చిన దుకాణాలను గుడ్ విల్ పేరుతో చేజిక్కించుకున్నారు. వ్యాపారంలో నష్టాలుంటాయంటూ భయభ్రాంతులకు గురి చేసి అమాయకుల నుంచి దుకాణాల నిర్వహణను సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అధికారులే తెర వెనుక పాత్రధారులు కావడం విడ్డూరంగా మారింది. దీనిపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సైతం ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో కొంతమంది అధికారుల తీరు ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లుగా మారింది. రాష్ట్ర ప్రభు త్వ ఉద్దేశాలను పక్కన పెట్టిన కొంత మంది ఆబ్కా రీ శాఖ అధికారుల సొంత ఎజెండా జిల్లాలో అమలవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి నిర్వహించిన ఎక్సైజ్ పాలసీలో సాహసోపేతమైన నిర్ణయా న్ని వెలువరించింది. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం, గౌడ కులస్తులకు 15శాతం చొప్పున దు కాణాలకు కేటాయించింది. వ్యాపార రంగంలో ఆయా వర్గాలు దూరంగా ఉండడంతో సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారు. మద్యం వ్యాపారంలో వారికి అవకాశాలు కల్పించడం ద్వారా ఔత్సాహికులు ఆర్థికంగా నిలబడతారని సర్కారు యోచించింది. అదే విధంగా గౌడ కుల వృత్తిదారులకు మేలు చేయాలని ఉద్దేశంతోనూ వారికి పెద్ద ఎత్తున దుకాణాలను రిజర్వేషన్ ద్వారా కేటాయించింది. కాగా కొన్ని దశాబ్దాలుగా మద్యం బిజినెస్‌లో రాజ్యమేలుతున్న వ్యాపారులు కుట్రలకు దిగుతున్నారు. పేదోడి నోటికాడి ముద్దను లా క్కున్నట్లుగా లక్కీడ్రాలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తుల కు వచ్చిన దుకాణాలను గుడ్‌విల్ పేరుతో చేజిక్కించుకున్నారు. వ్యాపారంలో నష్టాలుంటాయంటూ భయపెట్టి అమాయకుల నుంచి దుకాణాల నిర్వహణను సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ అధికారులే తెర వెనుక పాత్రధారులు కావడం విడ్డూరంగా మారింది.
చేతులెత్తేసిన ఆబ్కారీ అధికారులు…
కొత్త మద్యం విధానం ప్రకారం నూతనంగా లక్కీ డ్రాలో చేజిక్కించుకున్న మద్యం దుకాణాలు 2021, డిసెంబర్ 1వ తారీఖు నుంచి మనుగడలో కి వచ్చాయి. 2023, నవంబర్ 30 వరకు నూతన మద్యం పాలసీ కొనసాగుతుంది. పారదర్శకంగా నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపులో గతానికి భిన్నంగా చాలామంది కొత్త వారికి, మ ద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులకు సై తం లక్కు వరించింది. దీంతో పాటు కొత్తగా ప్రభు త్వం కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్ కోటాతో ఎస్సీ, ఎస్టీ, గౌడ వర్గాలకు చెందిన వారు చాలా మందికి అదృష్టం దక్కింది. వీరంతా తమ కాళ్లపై తాము నిలబడాలనే తాపత్రయంతో దుకాణాలను నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. కిరాయిలు మాట్లాడుకున్నారు. ఫైనాన్స్‌లో చెల్లింపు మొత్తాల ను సర్దుబాటు చేసుకున్నారు. కానీ డిసెంబర్ ఒక టో తారీఖు ముందు నుంచే పేరు మోసిన లిక్కర్ బాబులు రంగంలోకి దిగి వారిపై పెత్తనం చెలాయించారు. లైసెన్సును తాకట్టు పెట్టాలంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఏమి చేయాలో తెలియక చాలా మంది అమాయకులు తర్జనభర్జన పడ్డారు. చేసేది లేక నిజామాబాద్ ఎక్సై జ్ శాఖ ఉన్నతాధికారులను కలిశారు. కొంత మంది ప్రలోభాలకు గురి చేస్తున్నారని తమ బాధ చెప్పుకున్నారు.ఒత్తిళ్లకు గురి చేసి దుకాణాలు అప్పగించాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు చేశారు. అయితే… స్పందించాల్సిన ఆబ్కారీ అధికారులు చేతులెత్తేశారు. పరోక్షంగా లిక్కర్ డాన్లకు వత్తాసు పలికారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత వర్గాలు మిన్నకుండి పోవడంతో లిక్కర్ గ్యాంగులదే పైచేయి అయ్యింది. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
గుడ్ విల్ పేరుతో వల…
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం దు కాణాల కేటాయింపులో పారదర్శకతకు పెద్ద పీట వేసింది. గతంలో కాంగ్రెస్ హయాంలో మద్యం వ్యాపారులను నాటి పాలకులు పెంచి పోషించారు. బినామీలతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే వైన్ షాపులను నిర్వహించారు. రాష్ట్రం రాక ముందు మద్యం దుకాణాలకు బహిరంగ వేలం ఉండడంతో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీపడి వేలం పాడేవారు. ఇతరులెవ్వరూ పోటీకి రాకండా బెదిరింపులకు దిగేవారు. సిండికేట్ వ్యవహారాలకు సైతం మద్యం వ్యాపారులు దిగేవారు. దీంతో ప్ర భుత్వ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సుల ఎంపిక జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం భిన్నమైన చర్యలకు ఉపక్రమించింది. సర్కారు లక్కీ డ్రా పద్ధతి పెట్టాక దుకాణాలు ఎవరికి వస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మద్యం వ్యాపారు లు తమ అనుచరులు, కుటుంబ సభ్యుల పేర్లతో వేర్వేరుగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించినా దుకాణాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. లక్కీ డ్రా విధానంలో అదృష్టం వరించి లక్కీడీప్‌లో సా మాన్యులకు సైతం దుకాణాలు దక్కుతున్నాయి. ఇలా డ్రాలో విజేతలై మద్యం దుకాణాలకు లైసెన్సులు పొందిన వారి ముందు మోకరిల్లాల్సి వస్తున్నది. మద్యం అమ్మకాలను అనుసరించి ఆ యా దుకాణాలకు రూ.40లక్షల నుంచి రూ.60లక్షల వరకు గుడ్‌విల్ పేరుతో వల విసిరి అమాయకులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. ఇలా సగం వైన్ షాపులు అక్రమంగా ఇతరుల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. బహిరంగంగానే ఈ తంతు జరుగుతున్నా ఆబ్కారీ శాఖ కండ్లు మూసుకుంది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా…
మద్యం వ్యాపారంలో గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సైతం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రిజర్వేషన్ కోటాను నిర్ణయించారు. ఇందు లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 వైన్ షాపుల్లో 24 దుకాణాలు ఆయా వర్గాలకు దక్కాయి. ఇందులో ఎస్సీలకు 11, ఎస్టీలకు 2, గౌడ కులస్తులకు 11 దుకాణాలు వరించాయి. వీటిలోనూ సామాన్యులకే మొన్నటి లక్కీ డ్రాలో దుకాణాలు వచ్చాయి. మద్యం సిండికేట్ వ్యాపారులు వీళ్లపైనా కన్నేశారు. గుడ్‌విల్ వల విసిరి అమాయకుల నుంచి నిర్వహణ బాధ్యతలు గుంజేసుకున్నా రు. వాస్తవానికి మద్యం వ్యాపారంలో కొంత మం ది వ్యక్తుల ప్రమేయమే దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నది. 30శాతం రిజర్వేషన్‌తో అణగారిన వర్గాలతో పాటుగా గౌడ కులస్తులకు దుకాణాలు కేటాయింపు సులువైంది. తద్వారా ఔత్సాహికులకు లాభం జరిగేలా ప్రభుత్వం యోచించింది. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, మద్యం వ్యాపారుల అత్యుత్సాహం తో నిజామాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో వైన్ షాపుల్లో నిర్వహణ బాధ్యతలన్నీ పక్కదారి పట్టాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఒకరివి అయితే… నిర్వహణ మరొకరి చేతుల్లోకి తారుమారు కావడం విడ్డూరంగా మారింది.