కామారెడ్డి, డిసెంబర్ 12: పెట్టుబడి కోసం అన్నదాత తిప్పలు పడకుండా భరోసానిస్తున్నది రైతుబంధు పథకం. ఏడేండ్ల కిందట.. ప్రతి సీజన్లో దుక్కి దున్ని నేలను సిద్ధం చేసుకుని విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు మాత్రం రైతులు చేయిచాపక తప్పని పరిస్థితి. బ్యాంకులకు వెళ్తే సవాలక్ష కొర్రీలతో రుణం దొరికేది కాదు. తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. లేదంటే దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు ఉద్దెర తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ప్రతికూల పరిస్థితుల్లో పంట చేతికి వచ్చేది కాదు. వడ్డికి పావుశేరు లెక్కన వచ్చిన పంటను అమ్మితే అసలు, మిత్తిపోను చివరకు మళ్లీ అప్పులే మిగిలేవి. ఒక్కోసారి రైతుకు ఆత్మహత్యే శరణ్యమయ్యేది. స్వరాష్ట్రం సిద్ధించాక రైతన్నకు అప్పుల భారం ఉండొద్దని.. అండగా నిలిచేలా రైతుబంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయం అందిస్తూ ఆర్థికంగా భరోసానిస్తున్నారు. ప్రస్తుతం యాసంగికి పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రైతుబంధుతో దూరమైన ఆర్థిక బాధలు…
వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు పడుతున్న కష్టాలను ఓ రైతుగా, ఉద్యమ నాయకుడిగా ప్రత్యక్షంగా చూసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. మొదట ఎకరానికి రూ.4వేల చొప్పున అందించగా, ఆ తర్వాత రూ.5వేలకు పెంచారు. రెండు సీజన్లకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు డబ్బులు ఖాతాలో పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2.62 లక్షల మందికి..
కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2,62,841 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందనున్నది. వీరి కోసం రూ.254కోట్ల12లక్షల37వేల824 విడుదల కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ద్వారా వెల్లడైంది. డిజిటల్ సైన్ అయిన పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా యాసంగికి పెట్టుబడిని అందించనున్నది. సీసీఎల్ఏ సమర్పించిన పట్టా
దారులతోపాటు ఆర్వోఆర్ పట్టాదారులకు రైతుబంధు డబ్బులు అందనున్నాయి. అయితే రైతుబంధు సహాయం వదులుకునే రైతులు గివ్ ఇట్ అప్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది.
రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి..
రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో విడుత కింద యాసంగికి పెట్టుబడిని అందించేందుకు సిద్ధమయ్యింది. మరో రెండు, మూడు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమకానున్నది. ఇందుకోసం ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు పూర్తి చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి విడుతల వారీగా రైతుబంధు సాయం విడుదల కానున్నది. బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్సీ కోడ్ లాంటి ఇబ్బందులు తలెత్తితే రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సంబంధిత శాఖ ఉన్నతాధి కారులు చెబుతున్నారు.