ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడు పాత నేరస్తుడే..
జువైనెల్ హోం నుంచి ఇటీవలే విడుదల
దొంగతనం కోసం వెళ్లి ఘాతుకం
వివరాలు వెల్లడించిన సీపీ కార్తికేయ
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ట్రిబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మూడువేల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కార్తికేయ వివరాలను వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన డిచ్పల్లి నేషనల్ హైవే పక్కన ఉన్న హార్వెస్టర్ రిపేరింగ్ గ్యారేజీలో నిద్రిస్తున్న హర్పాల్ సింగ్(32), జోగిందర్ సింగ్ (46), బానోత్ సునీల్(25) ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశారు. అనంతరం వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, రూ.3 వేలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పై డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఇన్చార్జి టి.స్వామి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఏసీపీ, ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో డిచ్పల్లి సీఐ రఘునాథ్, నగర సీఐ సత్యనారాయణ, సీసీఎస్ సీఐ మురళీకృష్ణ, సీఐ కృష్ణ, డిచ్పల్లి ఎస్సై ఆంజనేయులు, ప్రొబేషనరీ ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డిచ్పల్లిలోని పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. ఫుటేజీల్లో అనుమానాస్పదంగా కనిపించిన నిజామాబాద్ నగరానికి చెందిన నేర చరిత్ర కలిగిన గంధం శ్రీకాంత్ అలియాస్ రమణపల్లి మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు ఆ రోజు రాత్రి నిజామాబాద్ నగరంలో మద్యం సేవించి ఇక్కడి నుంచి బస్సులో డిచ్పల్లి వరకు వెళ్లాడు. డిచ్పల్లిలో దొంగతనం చేసేందుకు అన్వేషిస్తూ గ్యారేజీ వద్దకు వెళ్లి అక్కడ ముగ్గురిని హత్యచేసి డబ్బులు, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లాడు. విచారణలో దొంగతనం చేసేందుకు వెళ్లి ముగ్గురిని హత్య చేసినట్లు శ్రీకాంత్ ఒప్పుకున్నాడని సీపీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లతో పాటు, రూ.2,850 నగదు స్వాధీనం చేసుకున్నారు.
హత్యాయత్నం కేసులో జువైనెల్ హోంలో మూడేండ్లు
ట్రిబుల్ మర్డర్ కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడు శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే నేరాలకు పాల్పడేవాడు. 13 ఏండ్ల వయస్సు నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2018 సంవత్సరంలో మరొకరితో కలిసి నిజామబాద్ జిల్లా కేంద్రంలోని హమాల్ వాడి సాయిబాబా ఆలయంలోకి చొరబడి పూజారిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో సంబంధిత మూడో టౌన్లో కేసు నమోదు చేసి మైనర్ కావడంతో కోర్టు ఆదేశాల మేరకు మూడు సంవత్సరాల పాటు హైదరాబాద్ జువైనెల్ సెంటర్కు తరలించారు. అక్కడ శిక్షా కాలం పూర్తి కావడంతో రెండు నెలల క్రితం విడుదలై వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడ్డాడు.