లింగంపేట, డిసెంబర్12: విద్యార్థులు ఓపెన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పరిశీలకురాలు పద్మశ్రీ అన్నారు. మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఓపెన్ తరగతులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి తరగతులకు తప్పకుండా హాజరుకావాలని, ఓపెన్ తరగతులు రెగ్యులర్ తరగతులతో సమానమని అన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. అనంతరం కేంద్రం నిర్వహణ రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట జిల్లా కో-ఆర్డినేటర్ తుల రవీందర్, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ వహీద్ సిద్ధిఖీ, ఉపాధ్యాయులు రాములు, రాజు, సాయిరాం, లక్ష్మణ్, యూసుఫ్ ఉన్నారు.
అందరికీ విద్య.. ఓపెన్ వర్సిటీ లక్ష్యం..
ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 12 : అందరికీ విద్యను అందించడమే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లక్ష్యమని ఎల్లారెడ్డి కో-ఆర్డినేటర్ ప్రభాకర్‌రావు అన్నారు. మండలంలోని బాలాజీనగర్‌తండా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021-22 విద్యా సంవత్సరంలో సగం సిలబస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో, మిగతా సిలబస్ ఆన్లైన్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. ఓపెన్ యూనివర్సిటీ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యయన కేంద్రం ప్రతినిధి సారిక, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.