నవీపేట, డిసెంబర్ 12: సామాజిక సేవలో భాగంగా యూవీకెన్ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని జన్నేపల్లి మహేశ్వరీ గార్డెన్ లో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజును పురస్కరించుకొని యూవీ కెన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. కరోనా సమయంలో బుక్కెడు తిండి కోసం నానా తంటాలు పడిన పేదలకు యూవీకెన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఎన్నో రకాల సేవలు చేసి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చైర్మన్ సూచించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ సంస్థ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. యూవీకెన్ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు సుజన్రావు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.వారికి మైనంపల్లి ట్రస్టు అండగా ఉంటుందన్నారు.
వైద్య శిబిరానికి స్పందన
మెగా వైద్య శిబిరంలో 350 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పలు గ్రామాలకు చెందిన యువకులు రక్త దానం చేశారు. అనంతరం మండలంలోని లింగాపూర్, సిరన్‌పల్లి, జన్నేపల్లి తదితర గ్రామాలకు చెందిన 300 మంది విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్యామాజీ సబిత, ఎంపీటీసీ బట్టు రాణి, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, యూవీకెన్ హెల్పింగ్ హ్యాండ్స్ వ్వవస్థాపకుడు డి.సుజన్రావు, సిరన్‌పల్లి సర్పంచ్ డి.సుధాకర్‌రావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, జన వికాస సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.