ఇందూరు, అక్టోబర్ 11 : కరోనా వైరస్ పుట్టుకతోపాటు దాని కారణంగా తలెత్తిన సమస్యలు, ఇబ్బందులు తదితర అంశాలపై పుస్తకాన్ని రాసిన మల్లవరపు చిన్నయ్యను ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా తనకు ప్రశంసాపత్రం అందినట్లు చిన్నయ్య సోమవారం తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, రచయిత మల్లవరపు చిన్నయ్య కరోనా వైరస్ పుట్టుకతోపాటు 1918 నుంచి వచ్చిన 12 ప్రాణాంతక వైరస్లు, కరోనా వైరస్‌పై చైనా చేసిన కుతంత్రం, కరోనాతో కర్షకులు, కార్మికుల ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం తదితర అంశాలపై ఇంగ్లిష్‌లో 216 పేజీల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఆగస్టు 24వ తేదీన నిజామాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రప్రతి వెంకయ్య నాయుడు చదివి రచయితకు అభినందనలు, ప్రశంసలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతి ప్రశంసలు పొందిన ఆయనకు జిల్లాకు చెం దిన కవులు ఘనపురం దేవేందర్, నరాల సుధాకర్, వీపీ చందన్రావు, కాసర్ల నరేశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.