నాగిరెడ్డిపేట్/తాడ్వాయి/ పిట్లం/ బీబీపేట్/ విద్యానగర్, అక్టోబర్ 10 : జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సైతం పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు. నాగిరెడ్డిపేట్, తాడ్వాయి మండలకేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు. అనంతరం సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. పిట్లం మండలకేంద్రంలోని గడి హనుమాన్ ఆలయం వద్ద మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. మండలకేంద్రంలోని వ్యాపారులు బతుకమ్మకు సంబంధించిన సామగ్రిని విక్రయించారు.
బీబీపేట్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు గ్రామాల్లో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద బతుక్మలను ఉంచి ఆడి పాడారు. అనంతరం నీటి కుంటలు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న ధర్మశాల, విద్యానగర్లోని సాయిబాబా ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయం, విద్యుత్నగర్లోని శివాలయంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
నిజాంసాగర్, అక్టోబర్ 10: మండల వ్యాప్తంగా సోమవారం అట్ల బతుకమ్మ, బుధవారం సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. ఈ మేరకు మండలంలోని వివిధ గ్రామాల్లో చౌరస్తాల వద్ద, చావిడిల వద్ద పంచాయతీ కార్మికులు ఆదివారం శుభ్రత పనులు చేపట్టారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్ద మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు రోడ్లపై గుంతలను మొరంతో పూడ్చివేయిస్తున్నారు. చెరువుల వద్ద, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో వీధిదీపాలను ఏర్పాటు చేస్తున్నారు.