ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 10 : ప్రతిఒక్కరూ మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించుకోవాలని న్యాయమూర్తి అనిత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో మెంటల్ డిజార్డర్ అంశంపై శనివారం ఏర్పాటు చేసిన న్యాయచైతన్య సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను స్వేచ్ఛగా పెంచుతూనే వారికి విషయపరిజ్ఞానాన్ని కలిగించాలన్నారు. పిల్లలకు చిన్న వయస్సులో సెల్‌ఫోన్‌ను ఇవ్వవద్దని సూచించారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే దవాఖనాల్లో చూపించుకోవాలని, మూఢనమ్మకాలను విశ్వసించవద్దని అన్నారు. ఎల్లారెడ్డి మున్సిఫ్కోర్ట్ న్యాయవాదులు, సిబ్బంది సహకారంతో ఇప్పటివరకు 130 న్యాయచైతన్య సదస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన జిల్లా పోలీస్ కళాజాత బృందం సభ్యులు ఆటపాటల రూపంలో మూఢనమ్మకాలపై రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ను న్యాయవాది అనిత తిలకించారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రవీంద్రమోహన్, సీఐ రాజశేఖర్, బార్‌కౌన్సిల్ అధ్యక్షుడు నామ శ్రీనివాస్, న్యాయవాదులు సాయిప్రకాశ్ దేశ్‌పాండే, గోపాల్‌రావు, నవీద్, నామ శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ జగ్జీవన్, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.