ఇందల్వాయి పెద్దచెరువులో చేపపిల్లలను వదిలిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి
ఇందల్వాయి, అక్టోబర్ 6 : కులవృత్తులకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని పెద్దచెరువులో బుధవారం చేప పిల్లలను వదిలారు. అనంతరం గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్య కార్మిక కుటుంబాలు బాగుండాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ చేప పిల్లలను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో కోటీ 10 లక్షల చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామని, ఇందు లో భాగంగా ఇందల్వాయి పెద్దచెరువులో 2లక్షల 24వేల చేపపిల్లలను వదిలామని వివరించారు. గతంలో కులవృత్తులను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదని, స్వరాష్ట్రంలో ఎవరికి ఏం కావాలో గ్రహించి ఏడేండ్లుగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూరల్ నియోజకవర్గంలో 20వేల ఎకరాల్లో పంటలు పండేవని, చెరువులను పునరుద్ధరించడం, వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రస్తుతం లక్షా 40వేల ఎకరాలు సాగవుతున్నాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని అన్నారు. ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, ఎంపీపీ రమేశ్‌నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ సత్తెవ్వ, సొసైటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్, జిల్లా మత్స్య పారిశ్రామిక శాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఉప సర్పంచ్ రాజేందర్, నాయకులు పాల్గొన్నారు.