
ఖలీల్‌వాడి, అక్టోబర్ 6: బతుకమ్మ పండుగ, దస రా ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనంగా స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశామని రీజినల్ మేనేజర్ సుధా పరిమళ తెలిపారు. ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి రూట్లలో మొత్తం 62 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి జేబీఎస్, జేబీఎస్ నుంచి నిజామాబాద్‌కు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అదనంగా బస్సులు నడుపుతామన్నారు. నిజామాబాద్ నుంచి జేబీఎస్‌కు ఎక్స్‌ప్రెస్ చార్జీ పెద్దలకు రూ. 195, డీలక్స్ సర్వీస్‌కు రూ. 220, సూపర్ లగ్జరీకి రూ.270, రాజధాని చార్జీ రూ. 330 ఉంటుందని వెల్లడించారు. ఆన్‌లైన్‌లోనూ www.tsrtconline.in ద్వారా సీట్లు రిజర్వు చేసుకోవచ్చునని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఒకేచోటు నుంచి కనీసం 30 మంది ఉంటే వారి సౌలభ్యంకోసం అక్కడికే బస్సును పంపిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆర్మూర్ 7382843133, బోధన్ 7382843570, నిజామాబాద్ 7382845603, బాన్సువాడ 9491105706, కామారెడ్డి 7382845388 నంబర్లను సంప్రదించాలని సూచించారు.