కామారెడ్డి టౌన్, అక్టోబర్ 6 : వివిధ కార్యక్రమాలకు విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో విశ్రాంత ఉద్యోగులు తమ అనుభవాన్ని జోడించి విజయవంతం చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులచెంతకు వెళ్లి ధైర్యం నింపడం, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి సలహాలు, సూచనలు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. టీకాపై అపోహలను దూరంచేసి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, కౌన్సిలర్ అనూష, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ అజయ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌రావు, ప్రతినిధులు శ్యామ్‌రావు, కుతుబుద్దీన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.