అటవీ భూముల రక్షణకు సర్కారు పెద్దపీట
ఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారి
ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాల రద్దుకు నిర్ణయం
కామారెడ్డి జిల్లాలో 7వేల ఎకరాలకు పైగా పోడు భూముల గుర్తింపు
కామారెడ్డి, నవంబర్ 1 :అటవీ భూములను సంరక్షిస్తూనే పోడు భూముల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో దీనిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8 నుంచి నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అటవీ సంపద రక్షించడంతో పాటు అడవి బిడ్డలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా గంజాయి సాగు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోడు పేరిట అటవీ విస్తీర్ణం తగ్గకుండా ఉండాలని కార్యాచరణ చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో 7వేల ఎకరాలకు పైగా అటవీ భూమి వివాదంలో ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మాచారెడ్డి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, జుక్కల్ మండలాల్లో వివాదాస్పద భూములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి 5వేల మంది పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోడు భూముల పట్టాలు ఉన్నా సాగు చేయనివ్వడం లేదని గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. పోడు సమస్య పరిష్కారమైతే 7వేల ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో పాటు అటవీ పరిరక్షణ ధ్యేయం గా కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నది. ఈ నెల 8 నుంచి నెల రోజుల పాటు పోడు భూముల సమస్యలపై దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అటవీ సంపద రక్షించడంతో పాటు అడవి బిడ్డలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా గంజాయి సాగు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోడు పేరిట అటవీ విస్తీర్ణం తగ్గకుండా ఉండాలని కార్యాచరణ చేపట్టారు. అడవులను ధ్వంసం చేసేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయనున్నారు. అడవుల లోపల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా సమీపంలో గల ప్రభుత్వ భూ ములను కేటాయించేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ భుములు అందుబాటులో లేకపోతే అడవుల అంచుల భుము లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
కామారెడ్డి జిల్లాలోని పోడు భూముల సమస్య పరిష్కారానికి సర్కార్ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసీ ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టనున్నారు. రెండు,మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజనల్ స్థాయిలో ఆర్డీవో, జిల్లాస్ధాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడవుల లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగు చేసేందుకు ఇవ్వాలని, లేనిపక్షంలో అటవీ భూముల అంచున సాగుభూమిని కేటాయించి నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించబోతున్నా రు. పోడు భుముల సమస్యల పరిష్కారం,అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు పోడు సాగు చేస్తున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పించడంతో పాటు అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలకు ప్రభుత్వ యంత్రాం గం సిద్ధమవుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో పోడు సమస్యకు చరమగీతం పాడాలని నిర్ణయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 853.21 కిలోమీటర్ల విస్తీర్ణం మేరకు అడవులు విస్తరించి ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్ని, ఇందల్వాయి, కమ్మర్ పల్లి, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్ అటవీ రేంజ్ కార్యాలయాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 600 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. కామారెడ్డి జిల్లా పరిధిలో మాచారెడ్డి, కామారెడ్డి, గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ అటవీ రేంజ్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా పరిలో డివిజన్ స్థాయిలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ పరిధులు ఉన్నాయి. వ్యవసాయం పేరుతో గిరిజనులు అటవీ భూములను ఆక్రమణలను గురి చేసి వందలాది ఎకరాలు ఆక్రమించుకున్న పరిస్థితి.
అటవీ భూముల సంరక్షణకు పెద్దపీట
పోడుకు పోను మిగిలిన అటవీ ప్రాంతాలను పూర్తిస్థాయిలో రక్షించేలా, భవిష్యతులో అటవీ విస్తీర్ణం తగ్గకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోడు భూములపై ఆదివాసులకు హక్కులు కల్పించే ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్-2006ను అమల్లోకి తీసుకవచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర సర్వే చేసి 2005 డిసెంబర్13 వరకు సాగులో ఉన్న పోడు భూములపై గిరిజనులకే హక్కులు కల్పించాలని ఆదేశించింది. 2006-07లో వైఎస్సార్ సర్కార్ హయంలో పోడు భూములపై సర్వే గిరిజనులకు సాగు హక్కులు కల్పించారు. 2006లో పోడు వ్యవసాయం చేస్తున్న కొందరు రైతులకు అప్పటి ప్రభుత్వం అటవీ హక్కుల పత్రాలను అందించింది. ఈ భూములకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నది. దీంతో మాచారెడ్డి, గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంత్లాల్లో పంటలను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో పోడు వ్యవసాయం కొనసాగుతూనే ఉంది. కొందరు తమ జీవనోపాధి కోసం తక్కువ విస్తీర్ణంలో అటవీ భూముల్లో పంటలు పండిస్తుండగా, మరికొందరు ఎక్కువ భూమిని ఆక్రమించుకుని పంట ల సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పో డు వ్యవసాయం కారణంగా పలు సమస్యలు వస్తున్నాయి. హరితహరంలో భాగంగా మొక్కలను నాటేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. అర్హులైన వారందరికి పట్టాల పంపిణి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
7వేల ఎకరాలకు పైగా పోడు భూములు
కామారెడ్డి జిల్లాలో కొంతకాలంగా పోడు భూము ల వివాదం కొనసాగుతునే ఉంది. జిల్లా వ్యాప్తంగా 7వేల ఎకరాలకు పైగా అటవీ వివాదంలో ఉన్నట్లు గుర్తించారు. కామారెడ్డి డివిజన్ పరిధిలో 60,920 ఎకరాల్లో అటవీ భూములు ఉండగా ఇందులో వివాదం లేని భూములు 58,434 ఎకరాలు ఉన్నాయి. 2,484 ఎకరాల భూములు వివాదంలో ఉన్నట్లు తేల్చారు. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో 82,835 ఎకరాల్లో ఫారెస్ట్ భూములు ఉండగా, ఇందులో వివాదం లేనివిగా 80,814 ఎకరాలున్నాయి. 2,021 ఎకరాలు వివాదంలో గుర్తించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 55,319 ఎకరాల అటవీ ప్రాంతానికి గాను 52,622 ఎకరాల భూములు వివాదం లేకుండా ఉండగా, 2,697 ఎకరాలు వివాదంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మాచారెడ్డి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, జుక్కల్ మండలాల్లో వివాదం గల భూములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
దీనికి సంబంధించి 5వేల మంది పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. మాచారెడ్డి మండలం పరిధిలో పలు గ్రామాల్లో అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నెలకొని ఉంది. తమ పరిధిలో ఉన్నాయని ఇరు శాఖల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అటవీశాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం, సరిహద్దు వివాదం చాలా ప్రాంతాల్లో నెలకొని ఉంది. పలు ప్రాంతాల్లో పోడు భుముల పట్టాలు ఉన్న చోట్ల సాగు చేయనివ్వడం లేదని గిరిజనులు అందోళనలు చేస్తున్నారు. పోడు సమస్య పరిష్కారం అయితే 7వేల ఎకరాలకు పైగా సాగు అయ్యే అవకాశం కనపడుతుంది.