ఖలీల్‌వాడి, నవంబర్ 1 : నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్ అధికారి శోభన్ బాబు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌ను ఆనుకుని ఉన్న వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడి జరగడం ఒక్కసారిగా కలకలం రేపింది. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజనకు సంబంధించిన వాహన యజమాని/ డ్రైవర్ సమీర్ హైమద్ నుంచి లంచం తీసుకుంటుండగా శోభన్‌బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వాహనానికి సంబంధించి ఎనిమిది నెలలుగా అద్దె పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉన్న అద్దె డబ్బులను చెల్లించాలని డ్రైవర్ సమీర్ హైమద్ ఏవోను కోరాడు. బిల్లు చెల్లించాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని శోభన్‌బాబు డిమాండ్ చేశాడు. దీంతో డ్రైవర్ సమీర్ హైమద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ఏవో శోభన్‌బాబుకు రూ.15 వేలు ఇస్తుండగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శోభన్‌బాబును అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సతీశ్‌కుమార్ తెలిపారు. దాడిలో ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.