మోపాల్ (ఖలీల్‌వాడి), నవంబర్ 1 : దేశ నిర్మాణానికి ల్యాబ్‌లు ఎంతో అవసరమని, ఇక్కడ సమస్యల పరిష్కారానికి విద్యార్థుల మనస్తత్వం అలవడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం మోపాల్ మండల కేంద్రంలోని ప్రెసిడెన్సీ హై స్కూల్లో నీతి అయోగ్, భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకమైన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల్లో శాస్త్రీయ స్వభావం, సృజనాత్మక ఆవిష్కరణలు, వ్యవస్థాపక ఆలోచనలు ప్రోత్సహించడానికి ఈ ల్యాబ్ స్థాపించబడిందన్నా రు. పాఠశాల నుంచి 1500 చదరపు అడుగుల పూర్తి స్థాయి స్థలాన్ని ల్యాబ్‌కు కేటాయించారని తెలిపారు. ఈ ల్యాబ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోటెక్నాలజీ మొదలైన తాజా సాంకేతిక సాధనాలకు యాక్సెస్‌ను అందిస్తుందన్నారు. ఈ సాధనాల ద్వారా పిల్లలు తమ సహజ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని, చాలా చిన్న వయసు నుంచే వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందించుకోగల్గుతారన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ప్రారంభించినందుకు ప్రెసిడెన్సీ యాజమాన్యాన్ని డీఈవో అభినందించారు. ప్రెసిడెన్సీ హై స్కూల్ ప్రిన్సిపాల్ శమంత మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాల ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. ఈ ల్యాబ్ యొక్క సెటప్ ద్వారా తమ విద్యార్థులు సరికొత్త సాంకేతికతకు ప్రాధాన్యతను పొందుతారన్నారు. ఈ ల్యాబ్‌ను తమకు మంజూరు చేసినందుకు అటల్ ఇన్నోవేషన్ మిషన్, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.