భీమ్‌గల్‌లో దిష్టిబొమ్మ దహనం
ఆర్మూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు
దళితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
భీమ్‌గల్,నవంబర్ 1: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను వివిధ సంఘాల నాయకులు ఖండించారు. సోమవారం భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన అర్వింద్‌ను వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నర్సయ్య, కో-ఆప్షన్ సభ్యు డు పర్స నవీన్, లాల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
ఆర్మూర్, నవంబర్ 1: దళితులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో సైదేశ్వర్కు టీఆర్ఎస్ ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షుడు జన్నెపల్లి రంజిత్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పట్టణంలో ఎలా అడుగు పెడుతారో చూస్తామన్నారు. ఇచ్చిన మాట తప్పి నీతిమాలిన చర్య తనకే సాధ్యపడుతుందన్నారు. తక్షణమే దళితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అర్వింద్‌ను అరెస్టు చేయాలి
బీబీపేట్, నవంబర్ 1: ఎస్టీ, ఎస్సీ చట్టాలను అవహేళన చేస్తూ మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను వెంటనే అరెస్టు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తలారి ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను హేళన చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తక్షణమే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు మేకల లావణ్య, జిల్లా నాయకులు చీకట్ల నిశిత, సిద్దాల స్వరూప తదితరులు పాల్గొన్నారు.