గులాబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు
వివరాలను సేకరించిన వ్యవసాయశాఖ అధికారులు
మొత్తం 19,911 ఎకరాల్లో ధ్వంసమైన పంటలు
నిజామాబాద్ జిల్లాలో 14,873 మంది రైతులకు నష్టం
వరి, సోయాబీన్ పంటలను తీవ్రంగా దెబ్బకొట్టిన భారీ వానలు
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదిక
నిజామాబాద్, అక్టోబర్ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం పంటల సీజన్లో మరోమా రు భారీ వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఇందూ రు అన్నదాతలను తీవ్రంగా కుంగదీసింది. కుండపోత వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అతి భారీ వానలకు తోడు గాలి దుమారం తీవ్రం గా చేటు చేసింది. దీంతో ఆరుగాలం సాగులో అన్నదాతకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. గులాబ్ తుఫాన్ రైతులను కోలుకోకుండా చేసింది. ఏపుగా ఎదిగిన వరి పంట నేలవాలి పూర్తిగా పనికి రాకుం డా పోయింది. దెబ్బతిన్న పంటలను చూసి కర్షకులు కంటతడి పెడుతున్నారు. వరుసగా ఎదురవుతున్న నష్టాలను తలచుకుని అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎదుట ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పంట నష్ట పరిహారం ద్వారా రైతులకు స్వాంతన చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. పంట నష్టం బీమా సౌకర్యం కల్పనతో పాటు పరిహారం చెల్లించి అన్నదాతకు ఇబ్బంది ఎదురవ్వకుండా చర్యలు తీసుకుంటున్నది. సకాలంలో పరిహారం అందివ్వడం ద్వారా కర్షకుడి కన్నీటిని తుడిచేలా తెలంగాణ వ్యవసాయ శాఖ యోచిస్తున్నది. పంట నష్టం వాటిల్లిన తర్వాత అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు రా వడం, పంట నష్టాన్ని అంచనా వేయడం, నివేదిక సమర్పించడం వరకు అప్రమత్తంగా వ్యవహరించారు.
వరి జోరు.. భారీ వర్షాలతో బేజారు…
గతం మాదిరిగానే వరి పంట సాగు నిజామాబాద్ జిల్లాలో జోరుగా ఉంది. 2020 వానకాలంలో 3లక్షల 86వేల ఎకరాల్లో వరి సాగవ్వగా 2021 సీజన్లో 3లక్షల 52వేల 52వేల 594 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. సాధారణ వరి విస్తీర్ణం 2లక్షల 86వేల ఎకరాలు మాత్రమే కాగా 130 శాతం మేర రైతులు పంటను సాగు చేయ డం విశేషం. 2019 వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 3,56,661 ఎకరాల్లో వరి సాగు చేశారు. 2020 వానకాలం సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం 2,38,138 ఎకరాలుండగా జోరు వానలతో అ మాంతం 3,86,156 ఎకరాల్లో దాదాపుగా వరి సాగైంది. సన్న రకాల సాగులో తెలంగాణ సోనా(ఆర్ఎన్ఆర్), హెచ్ఎంటీ, బీపీటీ 5201, జై శ్రీరాం, గంగా-కావేరి వంటి రకాలను ఇందూరు రైతులు ఎంచుకున్నారు. పప్పు దినుసుల సాగులో గతంలో మాదిరిగానే నిజామాబాద్ జిల్లా వెనుకబాటులో ఉంది. ఇప్పటి వరకు అంచనాలకు విరుద్ధం గా పెసర్లు 443 ఎకరాల్లో, మినుములు 565 ఎకరాల్లో, కంది 6219 ఎకరాల్లో, 26,657 ఎకరాల్లో మక్కజొన్న పంటలు సాగయ్యాయి. సోయాబీన్ 63,842 ఎకరాల్లో, పత్తి 2,546 ఎకరాల్లోనే సాగుకు నోచుకుంది. గతేడాది కన్నా ఈసారి పత్తి సాగు వైపు రైతులు అంతగా శ్రద్ధ కనబర్చలేదు.
పంట నష్టం వివరాలివీ…
నిజామాబాద్ జిల్లాలో 6,800 మంది రైతులకు చెందిన 10,644 ఎకరాల్లో 33శాతం కన్నా తక్కువ స్థాయిలో పంటలకు నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే అధికంగా 9267 ఎకరాల్లో 8,073 మంది రైతుల పంటలకు తీవ్రంగా నష్టం వెలుగు చూసింది. అతి భారీ వర్షాలతో మొత్తం 19,911 ఎకరాల్లో 14,873 మంది రైతుల పంటలు దెబ్బతిన్నట్లుగా వ్యవసాయాధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. 33శాతం కంటే అధికంగా దెబ్బతిన్న పంటల్లో వరి పంట 5,323 మంది రైతులకు చెందిన 6,634 ఎకరాల్లో ధ్వంసమైంది. మక్కజొన్న పంట 145 మంది రైతులకు చెందిన 198 ఎకరాలు ధ్వంసమైంది. సోయాబీన్ 1,282 మంది రైతులకు చెందిన 2,335 ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోయింది. 50 మంది కర్షకులకు చెందిన పొగాకు పంట 100 ఎకరాల్లో వానలకు పాడై పోయింది. 33శాతం తక్కువ స్థాయిలో పం టలు దెబ్బతిన్న వాటిల్లో 6722 మంది రైతులకు చెందిన 8578 ఎకరాల వరి పంటలున్నాయి. మక్కజొన్న 263 మంది రైతుల 395 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. సోయాబీన్ 1084 మంది రైతులకు చెందిన 1663 ఎకరాలు దెబ్బతిన్నట్లుగా వ్యవసాయాధికారులు తమ పరిశీలనలో తేల్చి చెప్పారు.
బీమా పేరుతో కేంద్రం కిరికిరి…
గతంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కేవలం రైతులను ఆట వస్తువుగానే పరిగణించేవి. పంట నష్టం వాటిల్లిన సమయంలో కనీసం రైతులకు ఊరట కలిగించే చర్యలే తీసుకునేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నది. పంట నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కిస్తూ పరిహారం అందివ్వడంలోనూ వేగంగా చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత బీమా, ఫసల్ బీమా యోజన పథకాల్లో నిబంధనల కిరికిరి పెట్టి రైతులతో ఆటాడుకుంటున్నది. బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు ఈ బీమా పథకాల ద్వారా లబ్ధి చేకూరడం కలగానే మిగులుతున్నది. అంతేగాకుండా ప్రయోజనం అంతగా లేకపోవడంతో కేంద్రం అందిస్తున్న బీమాను రైతులు తిరస్కరిస్తున్నారు. ప్రీమియం చెల్లించినప్పటికీ పంట నష్టం తర్వాత పరిహారం సకాలంలో రావడం లేదనే రైతులు బీమా చెల్లింపులపై అనాసక్తి చూపిస్తున్నారు. ఇక ఈసారి సీజన్‌కు సంబంధించి వరికి జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే బీమా చెల్లించారు. ఇక మక్కజొ న్న పంటకు సైతం బీమాకు రైతులు మొగ్గు చూపలేదు. దురదృష్టవశాత్తు ఈసారి వర్షాలతో అధిక మొత్తంలో నష్టపోవడంతో రైతుకు ఊహించని విపత్తు ఎదురైనట్లు అయ్యింది. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు సేకరించిన పంట నష్టం వివరాల నివేదికను కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ సమర్పించనున్నది.