నేటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో పంపిణీ
నేడు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలు
5 లక్షల 71 వేల మంది ఆడబిడ్డలకు అందనున్న కానుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆర్మూర్, అక్టోబర్ 1 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా ఆడబిడ్డలకు రాష్ట్రప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నది. ఈ ఏడాది కూడా పండుగ కానుకను ప్రభుత్వం అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో నేటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్హులైన మహిళలందరికీ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 5.71 లక్షల మందికి చీరలు అందించనున్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకొనేలా రాష్ట్ర ప్రభు త్వం కానుకలను అందిస్తున్నది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగను ప్రతిఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ సారెను అందజేస్తున్నది. ఈ ఏడాది కూడా నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుమారు 5 లక్షల 71 వేల మంది ఆడబిడ్డలకు రేషన్ షాపుల ద్వారా చీరలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాం గం ఏర్పాట్లు చేసింది. కుల మతాలకతీతంగా ఘ నం గా నిర్వహించుకునే బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికులతో నాణ్యమైన రంగు రంగుల ఆకర్షణీయమైన బతుకమ్మ చీరలను తయారు చేయించింది. తెల్లరేషన్ కార్డు, అంత్యోదయ కార్డు కలిగిన 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆర్డీవోలతో పాటు తహసీల్దార్లకు చీరల పంపిణీపై ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. జిల్లాలోని నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో 2, 32,108, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో 1,63, 279, బోధన్ రెవెన్యూ డివిజన్లో 1,75,530 మంది పేదింటి ఆడబిడ్డ లబ్ధిదారులున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 లక్షల 70వేల 917 మంది నిరుపేద ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందనున్నాయి.
పట్టణాల్లో మెప్మా, గ్రామాల్లో ఐకేపీ అధికారులు చీరల పంపిణీని పర్యవేక్షించనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర రో డ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బోధన్‌లో ఎమ్మెల్యే మహ్మ ద్ షకీల్, నిజామాబాద్ నగరం లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చీరల పంపిణీని శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
బతుకమ్మ చీరలను అర్హులైన పేదింటి ఆడబిడ్డలకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఆర్మూర్ మండలంలో 20,990 మందికి, మున్సిపాలిటీలో 22,676 మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందనున్నాయి. ఇప్పటికే ఆర్మూర్‌లోని గోదాముకు బతుకమ్మ చీరలు వచ్చాయి.
-వేణుగోపాల్‌గౌడ్, తహసీల్దార్, ఆర్మూర్
ఎంతో ఆనందంగా ఉంది..
ప్రభుత్వం బతుకమ్మ పండగకు కానుకగా చీరలు ఇవ్వడం ఎం తో సంతోషంగా ఉంది. రేషన్ దుకాణాలకు పోయి చీరలను తెచ్చుకుంటున్నాం. బతుకమ్మ పండుగలతో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగలకు సందర్భంగా పేదవారికి కానుకలను ఇవ్వడం బాగుంది.
-ఇట్టెడి అనితా సంతోష్‌రెడ్డి, కోటార్మూర్, ఆర్మూర్