ముంపు గ్రామానికి చెందిన ముగ్గురు డిగ్రీ విద్యార్థుల కోసం నిజాంసాగర్ ఆరు గేట్ల మూసివేత
వారం రోజులుగా జలదిగ్బంధంలో కుర్తి గ్రామం
నీటి విడుదల నిలిపివేతతో నిత్యావసర సరుకుల కోసం గ్రామస్తుల రాకపోకలు
వాగు వద్దే ఆసరా పింఛన్లను అందజేసిన అధికారులు
పిట్లం, నిజాంసాగర్, అక్టోబర్ 1: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామానికి ఒకవైపు మంజీరా నది, మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నాయి. ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు తెరిచినా.. వరదనీరు కుర్తి గ్రామం చుట్టూ వాగు ద్వారా వెళ్లి మంజీరలో కలుస్తుంది. దాంతో గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. ఎగువ నుంచి భారీ ఇన్‌ఫ్లో నమోదవుతున్న నేపథ్యంలో నిజాంసాగర్ వరద గేట్లను తెరిచి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ఫలితంగా పదిరోజులుగా కుర్తి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గ్రామానికి చెందినవారు బయటికి రావడానికి, బయటివారు అక్కడికి వెళ్లడానికి వీల్లేకుండా పోయింది.
ఇటీవల డ్రోన్ ద్వారా చిన్నారికి మందుల చేరవేత
రెండురోజుల క్రితం ఏడాదిన్నర వయసున్న చిన్నారి అస్వస్థతకు గురవడంతో.. వారి ఫోన్‌కాల్‌కు స్పందించిన అధికారులు డ్రోన్ ద్వారా అవసరమైన మందుల్ని పంపించారు. బాలుడి ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలందుకున్నారు. తాజాగా తమకు శుక్రవారం డిగ్రీ పరీక్ష ఉందని.. ఎలా హాజరుకావాలో తెలియడం లేదని కుర్తి గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ రామ్మోహన్రావు శుక్రవారం ఉదయం ప్రాజెక్టు ఆరు గేట్లను మూసివేయించారు. నీటి విడుదల నిలిచిపోవడంతో విద్యార్థులు వాగును దాటి వచ్చారు. వారిని బాన్సువాడలోని పరీక్షా కేంద్రానికి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. సాయంత్రం వరకు గేట్లు మూసి ఉంచుతామని అధికారులు ప్రకటించడంతో.. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే గడిపిన గ్రామస్తులు నిత్యావసర సరుకుల కోసం ఎగబడ్డారు. సమీప మండల కేంద్రాలకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. ఎంపీడీవో వెంకటేశ్వర్రావు గ్రామస్తులకు వాగువద్దనే ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 66,300 క్యూసెక్కుల భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయం త్రం ఏడు గంటలకు అధికారులు మళ్లీ ఆరు గేట్లను తెరిచి మొత్తం 11 గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టారు.
చాలా సంతోషంగా ఉంది
మాకు పరీక్ష రాసేందుకు అవకాశం రాదేమోనని భయపడ్డాం. నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో నీట విడుదలను తగ్గించారు. దీంతో మే ము శుక్రవారం పరీక్ష రాసేందుకు గ్రామం నుంచి బయటికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. నూతన వంతెన నిర్మాణ పనులు పూర్తయితే మాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
-నిఖిత, డిగ్రీ విద్యార్ధి