ఖలీల్‌వాడీ, ఏప్రిల్ 22: నగరంలో ఏర్పాటు చేయనున్న ఐటీహబ్ ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో- ఆర్డినేటర్ మహేశ్ బిగాలతోపా టు అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై బృందంతో కలిసి నూతన కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న ఐటీ హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ద్వితీయ శ్రేణి ఐటీని విస్తరించాలని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికే ఐ టీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహేశ్ బిగాల సహకారంతో అమెరికాలో పర్యటించి కొన్ని ప్రిలిమినరీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని వచ్చినట్లు చెప్పారు.
నూతన కలెక్టరేట్ రోడ్డులో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ పనులను అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై బృందంతో కలిసి పరిశీలించి, వారికి వివరించినట్లు తెలిపారు. ఎన్నారై బృందం సభ్యులు ప్రవీణ్ విఠల్ (గ్లోబల్ సీఈవో), కాకతీయ సాండ్‌బాక్స్ మనీశ్ జైస్వాల్ సూచన మేరకు తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారని చెప్పారు. ప్రతిభ కలిగిన స్థానిక యువతను ఎలా రిక్రూట్ చేసుకోవాలి.. ఎలా శిక్షణ ఇ వ్వాలి తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో- ఆర్డినేటర్ మహేశ్ బిగాల సహకారంతో వచ్చే జూన్‌లో అమెరికాలో పర్యటించి, కంపెనీల స్థాపనకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎన్నారై బృందం సభ్యులను సన్మానించారు. సమావేశంలో ఐటీ కంపెనీల ప్రతినిధులు ప్రవీణ్, మనీశ్ పాల్గొన్నారు.