దౌర్జన్యం చేస్తే రౌడీషీట్..
పాత నేరస్థులే నిందితులైతే… పీడీ యాక్ట్
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
రంగం సిద్ధం చేసిన సీపీ
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 20:అసాంఘిక కార్యకలాపాలపై నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు వదిలించేందుకు పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. కమిషనరేట్ పరిధిలో మట్కా, గుట్కా, గంజాయిని నిర్మూలించేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ బాస్ రంగం సిద్ధం చేశారు. మరోవైపు చట్టవ్యతిరేక పనులను ప్రోత్సహించిన, పాల్పడిన వారి భరతం పట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. అమాయకులపై దౌర్జన్యం చేసి, దాడులు చేయడం, డబ్బులు లాక్కోవడంలాంటి పనులు చేసే అల్లరిమూకలపై ప్రత్యేక నిఘా పెట్టారు. గొడవలకు దిగుతూ, దాడులకు పాల్పడిన వారిపై అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గొడవలకు పాల్పడిన వారు పాత నేరస్థులు కాకపోయినా వారిపై సైతం రౌడీషీట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
రౌడీ షీటర్ల కదలికలపై నిఘా..
వీధి రౌడీలు.. కరడుగట్టిన రౌడీషీటర్ల కార్యకలాపాలపై పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. జిల్లాలో రౌడీయిజం అనేది లేకుండా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చెక్‌పెట్టి శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సిబ్బందిని సీపీ ఆదేశించారు. ఇప్పటి వరకు ఏవైనా గొడవలు,అల్లర్లకు పాల్పడి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న పాతనేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారి ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పాత నేరస్థులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వారి దినచర్య ఎలా ఉంది, గతంలో మాదిరి ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారా? దౌర్జన్యానికి పాల్పడుతున్నారా? అనే వివరాలను సేకరించి వాటిని ప్రతి రోజూ పోలీస్ బాస్‌కు రిపోర్టు చేస్తున్నారు. రౌడీషీట్ ఉన్నప్పటికీ మళ్లీ గొడవలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్(ప్రివెంటివ్ ఆఫ్ డిటెంన్షన్-1950 యాక్ట్) ప్రకారం కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మత్తును నిర్మూలించేలా..
జిల్లాలో గుట్కా, గంజాయి అమ్మకాలు, వినియోగంపై పోలీసులు యంత్రాంగం దృష్టి సారించి అరికట్టేందుకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. గంజాయి, గుట్కా సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లతోపాటు కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గంజాయిని పూర్తిగా నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖతో కలిసి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మత్తుకు అలవాటుపడిన యువకులు నిత్యం ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై దృష్టిసారించారు. గతంలో గంజాయి విక్రయించిన పాత నేరస్థులతోపాటు కొత్తగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న వారిపై దాడులు చేస్తు కేసులు నమోదు చేస్తున్నాయి. పాత నేరస్థులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదుకు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
జిల్లాను ప్రశాంతంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా గంజా యి, మట్కా, గుట్కా, జూదం నిర్మూలనతోపాటు పీడీఎస్ బి య్యం అక్రమ రవాణాపై ప్రత్యేక బృందాలతో నిఘా పె ట్టాం. ఎవరైనా గొడవలు, దౌర్జన్యాలు చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. పాత నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ప్రత్యర్థులు లేదా రౌడీయిజం చేసే వారితో ఇబ్బందులకు గురైతే నిర్భయంగా మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలి.
– నాగరాజు, సీపీ, నిజామాబాద్