కామారెడ్డి, అక్టోబర్ 8 : అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన 3246 మంది కుటుంబాలకు భరోసా దక్కింది.
2020-21 సంవత్సరంలో 1584 మందికి బీమా
2020-21 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 55 వేల 566 మంది రైతులు నమోదై ఉన్నారు. వీరిలో లక్షా 68 వేల 700 మందిని బీమా పథకానికి అర్హులుగా గుర్తించారు. 1611 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. వీరిలో 1584 మందికి రూ. 5లక్షల చొప్పున మొత్తం రూ. 79.20 కోట్లు బీమా పంపిణీ జరిగింది. 2018 సంవత్సరంలో లక్షా 31వేల 759 మంది రైతులకు రైతుబీమా వర్తింపజేశారు. వీరిలో 787 మంది వివిధ కారణాలతో మృతి చెందగా, రూ.5లక్షల చొప్పున రూ.39.35 కోట్లు బీమా కింద విడుదల చేశారు. 2019లో 1,57,141 మందికి రైతుబీమా వర్తింపజేయగా, 872 మంది రైతులు మరణించారు. 872 మంది రైతు కుటుంబాలకు రూ. 43.60 కోట్ల బీమా మొత్తాన్ని అందించింది. 2021-22 సంవత్సరంలో లక్షా 86 వేల 417 మంది రైతులు బీమా అర్హత సాధించారు. వీరిలో 95 మంది అన్నదాతలు మరణించగా వీరిలో ముగ్గురికి బీమా పరిహారం రూ.15లక్షలు విడుదల చేశారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి 18 నుంచి 58 ఏండ్ల వయస్సు ఉన్న ప్రతి రైతుకు బీమా వర్తింప జేస్తున్నారు.
రైతుపై భారం లేకుండా..
అన్నదాతల కుటుంబాలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. దళారుల ప్రమే యం లేకుండా రైతులకు పైసా ఖర్చు కాకుండా బీమా భరోసా కల్పిస్తున్నది. రైతు మృతి చెందిన వెంటనే వ్యవసాయశాఖ అధికారులు పూర్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని అన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో రైతు మరణించిన కుటుంబాలకు 10 రోజుల్లో నామినీ అకౌంట్లో రూ. 5 లక్షలు జమ చేస్తారు. అర్హులైన రైతుబీమా కుటుంబాల వారి వివరాలను క్లస్టర్ల వారీగా జాబితా రూపొందించారు. కామారెడ్డి జిల్లా పరధిలో 104 క్లస్టర్ల వారీగా రైతులు సాగు చేసిన పంటలు, పూర్తి వివరాల జాబితాను తయారు చేశారు.