Kamareddy | కామారెడ్డి : గత వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలలో కామారెడ్డి జిల్లా ముందు వరసలో నిలిచింది. ధాన్యం సేకరణ, వివరాల నమోదు, రైతులకు మద్దతు ధర కల్పించడంలో అధికారులు క్రియాశీలక పాత్ర వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలో ధాన్యం సేకరించగా అందులో ఐదు జిల్లాల్లో అత్యుత్తమమైన ఫలితాలు రాబట్టారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సమన్వయం, FCI నుండి క్లెయిమ్‌లు మొదలైన ఐదు వేర్వేరు విభాగాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలను పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశంసించారు.
రైతులకు సకాలంలో MSP చెల్లింపుల విభాగంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మూడు రోజుల్లో చెల్లింపులు జరిగాయి. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం కామారెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వరరావు, కామారెడ్డి పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్‌కు ప్రశంసా పత్రం జారీ చేశారు. ఈ మేరకు ఇరువురు అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేకంగా అభినందించారు.