ఖలీల్వాడి, మార్చి 18 : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలని ప్లకార్డ్సుతో మంగళవారం శాసనసభ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను వంచించినట్లు విద్యార్థులను కూడా మోసం చేసిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ సభలో తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయిస్తామని హామీనిచ్చి, గతేడాది కేవలం రూ.9,200 కోట్లను మాత్రమే కేటాయించిందని తెలిపారు.