హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి అనుమతులన్నీ మంజూరయ్యేదాకా నిర్మాణ ప్రక్రియ చేపట్టరాదంటూ చెన్నైలోని జాతీ య హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ప్రతివాదులైన ప్రైవేటు వ్యక్తులతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. సుమారు 71,600 ఎకరాలకు సాగునీరందించే ఉమామహేశ్వర ప్రాజెక్టు పనులను ఎలాంటి అనుమతుల్లేకుండా చేపట్టారంటూ అనంత సీతారాంరెడ్డి మరొకరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై ఫిబ్రవరిలో విచారణ జరిపిన ఎన్జీటీ తుది అనుమతుల్లేకుండా పనులు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై చీఫ్‌జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని అన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.