నిజామాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కల్తీ కల్లుకు అమాయకులు అనారోగ్యం బారిన పడి దవాఖానలో చేరుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కల్తీ కల్లుకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ప్రాణ నష్టం జరిగితే తప్ప అధికారుల నుంచి స్పందన కరువైంది. జిల్లా కేంద్రాలతోపాటు పల్లెల వరకు చాపకింద నీరులా కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నా..సంబంధిత శాఖాధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. కల్తీ కల్లు తాగి జనాలు దవాఖానల్లో చేరితేనే అధికారులు స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడిగా దాడులు నిర్వహించి ఆల్ఫ్రాజోలం పట్టుకుంటున్నారు. కల్తీ కల్లును నివారిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తీరా గంట ల వ్యవధిలో షరామామూలే అన్నట్లుగా చేతులెత్తేస్తున్నారు. దీంతో కల్తీ కల్లు మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోయిం ది. అక్రమార్కులకు తెర వెనుక నుం చి సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ వైపు ఎన్ఫోర్స్మెం ట్ అధికారులు దాడులు నిర్వహిస్తూ కిలోల కొద్దీ ఆల్ఫ్రాజోలం పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కల్తీ కల్లు తయారీ మాత్రం ఆగడం లేదు. గుట్టుగా ఆల్ఫ్రాజోలం దక్కించుకుని నీళ్లలో చక్కెర మిశ్రమంతో కలిపి కల్లును తయారుచేస్తున్నారు. ఈ కల్లునే సీసాల్లో నింపి మందుబాబులకు అంటగడుతున్నారు. గ్రామా ల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు అమ్మకాలు జోరందుకుంటున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ కల్లు జడలు విప్పుతున్నది. తెర వెనుక ప్రభుత్వంలోని పెద్దలే అండదండగా నిలిచి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొంత మంది బడానాయకుల అండతోనే కల్తీ కల్లు మాఫియా ఉమ్మడి జిల్లాలో చెలరేగిపోతోంది.
ఇటీవల హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి పది మంది వరకు మృతిచెందారు. సంచలనం రేపిన ఈ ఘటనతో అప్రమత్తమైన ఎక్సైజ్ శాఖ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. అయితే ఈ దాడులు కేవలం తూతూ మంత్రంగానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో కల్లు డిపోలకు కేటాయించిన ఈత వనాలు ఎన్ని? అందులో నుంచి వస్తున్న తాజా కల్లు ఎంత? అనే విషయాలను పరిశీలించలేదు.
కేటాయించిన రేషన్ కన్నా ఎక్కువే ఆయా కల్లు డిపోల్లో కల్లు ఉత్పత్తి అవుతోంది. డిపోల్లో అధికారులకు ఎదురుగా కనిపించే సీసా పెట్టెలే ఇందుకు నిదర్శ నం. అయినప్పటికీ వాటి జోలికి వెళ్లలేదు. శాంపిల్స్‌ను సేకరించి ఫొటోలు తీసి బయటికి పంపించడంతోనే మమ అనిపించారు. సీన్ కట్ చేస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈత వనాల నుంచి వచ్చే తా జా కల్లు కన్నా, పది రెట్లు కల్తీ కల్లు ఉత్పత్తి అవుతుండడం గమనార్హం. ఇదీ బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదు. కల్లు డిపోల్లో సేకరించిన శాంపిల్స్‌ను ర్యాండమ్‌గా సేకరిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ప్రజలు భావిస్తున్నారు. ముందస్తుగానే సమాచారం ఇచ్చి దాడులు నిర్వహిస్తే ఫలితం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కల్తీ కల్లు నియంత్రణలో ఉమ్మడి జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నెలల క్రితం నస్రుల్లాబాద్, బీర్కూర్, గాంధారి మండలాల్లో సుమారుగా వంద మంది కల్తీ కల్లు బారిన పడ్డారు. ఆ సమయంలో నానా హైరానా చేశారు. కొద్ది మందిపై కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల పాటు కల్లు డిపోలను మూసేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ఓ కల్లు డిపోకు అనుమతి లేకున్నప్పటికీ అక్రమార్కులు యథేచ్ఛగా కల్లు డిపోను నడిపించడం ఆ సమయంలో వెలుగు చూసింది. ఇలా నిరంతర తనిఖీలు చేపడితే అనేక లోపాలు మరోసారి బహిర్గతమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రాణాలు పోతే లేదంటే కల్తీ కల్లు తాగి అవస్థలు ఎదుర్కొంటేనే సంబంధిత అధికారులు స్పందిస్తున్నారు. కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలని ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
అధికారులు దాడులు నిర్వహించకపోవడంతో కల్తీ కల్లు విచ్చలవిడిగా తయారై బయటికి వస్తున్నది. ఎంచక్కా ప్రధాన రహదారుల గుండా వాహనాల్లో ఆయా కేంద్రాలకు చేరి అక్కడ్నుంచి మందుబాబుల చేతికి సీసాలు ముడుతున్నాయి. రోడ్లపై రవాణా సమయంలో, విక్రయ కేంద్రాల్లో కల్లు సీసాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తే కల్తీ కల్లు గుట్టు రట్టు కావడం ఖాయం. కానీ ఇదంతా తెలిసినప్పటికీ చూసీ చూడనట్లుగా ఆబ్కారీ శాఖ వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ కల్లు మాఫియాను అధికార పార్టీకి చెందిన కీలక నేతలు కాపాడుతుండడమే కారణంగా తెలుస్తున్నది.