ఖలీల్‌వాడి, జూన్ 22 : తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటమైన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే అన్నం పెట్టే అక్షయ పాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జవన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆరేండ్లుగా పారుతున్న నీళ్లతో అప్పటి వరకు నోళ్లు తెరిచిన భూములు పచ్చని పంటలతో విరాజిల్లుతూ రైతుల నూరేళ్ల కష్టాలు తీర్చాయని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల జరిగి ఆరేండ్లయిన సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలియని వారే విషం కక్కుతున్నారని, కాంగ్రెస్, బీజేపీపై ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందుతున్నదని, కోట్లాది మందికి తాగు నీరందిస్తున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచాన్నే అబ్బురపరిచిందని, కేసీఆర్ దీక్షా దక్షతను శత్రువులు సైతం కొనియాడారని తెలిపారు.
కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే, కాంగ్రెస్ విషం పారిస్తున్నదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి అంటగట్టి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి తెలంగాణ స్ఫూర్తి ప్రదాతను అవమానించిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాళేశ్వరం ఆయకట్టు రైతులకు జీవన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.