కామారెడ్డి, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఈనెల 15వ తేదీన కామారెడ్డి బీసీ మహాసభను నిర్వహించనున్నట్లు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆలిండియా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభ పెట్టి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిక్లరేషన్ చేశారని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నదన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.