నిజామాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్ర సాధనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నది. మలిదశ పోరాటంలో కేసీఆర్ వెన్నంటే నిలిచి విజయతీరాలకు చేర్చిన ఘనతలో ఈ ప్రాంతం చూపిన స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం చరిత్రలో నిలిచింది. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న స్వల్ప కాలంలోనే ఎదురైన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి నిజామాబాద్ చరిత్ర సృష్టించింది. సమైక్యవాద పార్టీలకు ముచ్చెమటలు పట్టించడంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటిచెప్పడంలో, రాజకీయ రణక్షేత్రంలో ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యాన్ని చూపారు. ఇందూరు జడ్పీ పీఠంపై గులాబీ జెండాను ఎగురవేసి నాటి కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు గట్టి షాక్‌ను ఇచ్చారు. తదనంతరం ఎదురైన ఉప ఎన్నికల్లో విజయాలు, లోకల్ బాడీ పోరులో భారీ గెలుపుతో టీఆర్ఎస్ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి కంచుకోటగా నిలిచింది. కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకుని ప్రతి ఉద్యమ సందర్భంలోనూ ఈ ప్రాంత బిడ్డలు ప్రాణాలు తెగించి కొట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన నిజామాబాద్ జిల్లా నేడు తాగు, సాగునీటితో పాటుగా అన్ని రంగాల్లోనూ ముందు భాగంలో నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వంలో పదేండ్లలో ఈ ప్రాంతం మరుపురాని అభివృద్ధిని నమోదు చేసింది. ఒకప్పుడు ధాన్యం ఉత్పత్తిలో అంతంత మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. దాదాపుగా 10లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకున్నాయి. నీటి పారుదల రంగంలో మిషన్ కాకతీయ, ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో బీడు భూములకు నీళ్లు మళ్లించారు. కొత్త గ్రామ పంచాయతీలు, కొత్తగా మండలాల కూర్పు, జిల్లా ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. కామారెడ్డి జిల్లా ఏర్పాటుతో మెరుపు వేగంతో అభివృద్ధి సాధించింది. మౌలిక సదుపాయాల కల్పన, పల్లెల్లో విప్లవాత్మకమైన మార్పు, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయ రంగంలో రైతులకు అనుకూలమైన వాతావరణం, సాగుకు ఢోకా లేకుండా ఉచితంగా నిరంతర కరెంట్‌తో అనతి కాలంలోనే తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.