ఆర్మూర్‌టౌన్, ఏప్రిల్ 21: ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి కలకలం రేపింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.7,500 లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టబడ్డాడు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు సంబంధించిన రూ.4.75లక్షల బిల్లును ఓ కాంట్రాక్టర్‌కు మంజూరుచేయాల్సి ఉన్నది.
అయితే బిల్లు మంజూరు చేయాలంటే సదరు కాంట్ట్రార్ను రూ.7.500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సదరు కాంట్రాక్టర్ సోమవారం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మకు రూ.7,500 ఇస్తుండగా, అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనల మేరకు కాంట్రాక్టర్ పేరును తాము వెల్లడించబోమని ఏసీపీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని చెప్పారు.