ఖలీల్‌వాడి, జూన్ 16 : అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫార్ములా ఈ కారు రేసింగ్ అక్రమ కేసులో మరోసారి ఏసీబీ విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు అక్రమ పాలనను ఎండగడుతూ ప్రజల పక్షాన గళమెత్తుతున్న కేటీఆర్ పై ఇంత కక్ష సాధింపా? అని ప్రశ్నించారు.
ఎలాంటి అక్రమాలు జరగని కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను నిన్న, హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం చేపట్టిన ఫార్ములా ఈ కారు రేసింగ్‌లో ఏదో జరిగిందని ఆధారాలు లేని అభియోగాలతో నేడు కేటీఆర్‌ను విచారణల పేరుతో వేధించడం తెలంగాణ ఆత్మగౌరవానికి మాయని మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై సీఎం రేవంత్ రెడ్డి కత్తి పెట్టి హింసిస్తూ ఇందిరమ్మ రాజ్యం అంటేనే అప్రకటిత ఎమర్జెన్సీ అని చాటుతున్నారని మండిపడ్డారు. మరో వంద అక్రమ కేసులు పెట్టుకున్నా తలవంచబోమని, అరెస్టుల మీద అరెస్టులు చేసుకున్నా భయపడబోమని స్పష్టం చేశారు.
కాళేశ్వరంపై విచారణ కాంగ్రెస్ కుట్ర అని, ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు కడిగిన ముత్యంలా ప్రజాక్షేత్రంలో నిలుస్తారని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో కేటీఆర్‌ను మిస్టర్ క్లీన్ గా ఆయన అభివర్ణించారు. కేటీఆర్ అరపైసా అవినీతికి పాల్పడలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై ఏదో రకంగా బురదజల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని, సర్కార్ దాష్టీకాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుట్రల నుంచి కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.