నందిపేట్, అక్టోబర్ 26 : కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తూ ఎవరికి ఏ అవసరాలున్నా తీరుస్తూ వస్తున్నాడని తెలిపారు. ముస్లిం పిల్లలు చదువుకోవడానికి నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.
రంజాన్ పండుగలో ఇఫ్తార్ విందును ఇస్తూ తోఫాలను అందించామన్నారు. మండల కేంద్రంలో కోటి రూపాయలతో షాదీఖానాను నిర్మించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మసీదుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో ముస్లింలను భాగస్వాములను చేసి సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో కొత్త పథకాలు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, మైనార్టీ నాయకులు హుస్నోద్దీన్, పాషా, ఖలీం, అహ్మద్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.