నిజామాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) దేశానికి బీజేపీ శనిలా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు ఎంపీ ధర్మపురి అర్వింద్ దరిద్రంలా దాపురించాడని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, బాజిరెడ్డి జగన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఈగ గంగారెడ్డి, సాంబారి మోహన్, సుజిత్ సింగ్ ఠాకూర్, ఇతర నాయకులతో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో గణాంకాలతో సహా వివరిస్తూ ఇప్పటి వరకు జిల్లాలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల తీరును వివరించారు. దాదాపు రూ.28వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా జీవన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఎంపీ అర్వింద్‌కు దమ్ము, ధైర్యం ఉంటే జిల్లా అభివృద్ధి విషయంలో తమతో పోటీ పడాలని సవాల్ విసిరారు.
తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన మోదీ వ్యాఖ్యలను సమర్థించిన ధర్మపురి అర్వింద్‌ను ఇకపై ప్రతి గ్రామంలో తరమాల్సిందేనని ప్రజలకు జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాండ్ పేపర్ రాసిచ్చి ఎన్నికల్లో పోటీచేసిన ఏకైక ఎంపీ అర్వింద్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతోనే రైతులంతా గ్రామాల్లో బీజేపీ ఎంపీ ని తిరగనివ్వడం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పత్తాలేని అర్వింద్… నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ ప్రధాన అడ్డంకిగా మారిండని విమర్శించారు. అర్వింద్‌కు హెయిర్‌తో పాటు బ్రెయిన్ లేదంటూ ఎద్దేవా చేశారు. క్యారెక్టర్, క్యాడర్ లేని వ్యక్తిగా అభివర్ణించారు.
నిజామాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 57,230 మందికి రూ.480 కోట్లు వెచ్చించినట్లు జీవన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సర్కారు దవాఖానల్లో 76,301 ఉచిత ప్రసవాలు జరిగాయన్నారు. డెలివరీకి వచ్చిన ఒక్కో మహిళకు రూ. 50వేల ఖర్చు పెట్టడమే కాకుండా అదనంగా రూ.12వే లు, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు సాయం అందించినట్లు వెల్లడించారు. రూ.714 కోట్లతో 73వేల గొర్రెల యూనిట్లు పంపిణీ చేసినట్లుగా చెప్పారు. హరితహారం పథకం కింద రూ.128 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు రూ.114.96 కోట్లు, చేప పిల్లల పంపిణీకి రూ.26కోట్లు, ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ కోసం రూ.230 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్, సబ్ రిజిస్ట్రార్ ఏర్పాటు చేశామన్నారు. 39 గురుకులాల ఏర్పాటుతో సుమారుగా 25వేల మంది విద్యార్థులకు రూ.1200కోట్లతో విద్యను అందిస్తున్నామన్నారు. రూ.119 కోట్లతో గోదావరిపై వంతెన నిర్మాణం, ఆర్మూర్ – నిజామాబాద్ ఫోర్‌లైన్ రహదారికి రూ.125 కోట్లు, ముంపు గ్రామాల్లో రూ.16కోట్లతో ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.120 కోట్లతో సోలార్ ప్రాజెక్టు, భీమ్‌గల్ మున్సిపాలిటీగా మార్పు, మిష న్ కాకతీయకు రూ.402 కోట్లు, మిషన్ భగీరథకు రూ.17 32 కోట్లు, ఓవర్సీస్ పథకం ద్వారా 17 మందికి రూ.6కోట్ల స్కాలర్ షిప్‌లు, రూ.50 కోట్లతో టీ-హబ్ నిర్మాణం, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.960 కోట్లతో అభివృద్ధి పనులు, ఆర్అండ్బీ నిధులు రూ.1452 కోట్లు, 20 చెక్ డ్యాముల నిర్మాణానికి రూ.413కోట్లు, కులవృత్తుల వారికి రూ.12కోట్లతో విద్యుత్ సబ్సిడీ, సీడీఎఫ్, ఎస్డీఎఫ్ నిధు లు రూ. 450 కోట్లు, జిల్లా దవాఖానల అభివృద్ధికి రూ.320కో ట్లు మంజూరు చేసినట్లుగా వివరించారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవన్నారు.
మూడేండ్లలో ఎంపీగా అర్విం ద్ చేసిందేమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాను విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఎంపీకి పంపిస్తానని, ఆయన చేసిందేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే క్షీరాభిషేకం చేస్తానన్నారు. కేసీఆర్ రైతుబంధువని, మోదీ ఏ బంధువో చెప్పాలని డిమాం డ్ చేశారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని చెప్పారు. ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, అయితే పాకిస్థాన్ లేదంటే ఖలిస్తాన్ అం టుందన్నారు. చైనావాల్ లేదంటే జమ్మూకశ్మీర్ అంటూ రెచ్చగొడుతుందన్నారు. సర్జికల్ స్ట్రైక్ లేదంటే రోహింగ్యాలంటూ ప్రజలను భ్రమింపజేస్తుందంటూ మండిపడ్డారు. బీజేపీ అరాచకాలకు చరమగీతం పాడేందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి బయల్దేరారన్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో సంవత్సరానికి రూ.100 కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ రూ.300కోట్ల నిధులు ఇవ్వడంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. రూ.252 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.40కోట్లతో ఐటీ హబ్, రూ.98కోట్లతో తాగునీటి సరఫరా, రూ.20కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టామన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూ.90కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లు చేపట్టామన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై అక్కసును వెళ్లగక్కడం సరికాదన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మాట్లాడింది నిజం కాదా? అని ప్రశ్నించారు.