ఎల్లారెడ్డి రూరల్/ఎల్లారెడ్డి, నవంబర్ 10: ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాజాల సురేందర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో ఉన్న తల్లి హనుమవ్వకు సతీమణి భార్గవితో కలిసి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సెంటిమెంట్‌గా గతంలో వినియోగించిన మెరూన్ కలర్ ఇన్నోవా కారులో బయల్దేరారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ముఖ్య అనుచరులతో కలిసి హంగూ ఆర్బాటం లేకుండా వచ్చిన జాజాల.. తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తిన్న తర్వాత ఎల్లారెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లారు. ఆర్వో మన్నె ప్రభాకర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్‌కుమార్, గాంధారి ఏఎంసీ చైర్మన్ సత్యం రావు, నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని కామారెడ్డికి దీటుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. నామినేషన్ అనంతరం మాజీ మంత్రి నేరెళ్ల, మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో కాళేశ్వరం జలాలపై స్పష్టత ఇచ్చారని, 22వ ప్యాకేజీ కింద ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోకవర్గాల్లోని ప్రతి గుంటకూ కాళేశ్వరం నీటిని అందిస్తామని ప్రకటించినట్లు గుర్తుచేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. 30 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం రెండేండ్లలోనే చేసి చూపించానన్నారు. కరోనా కారణంగా రెండేండ్ల సమయం వృథా అయ్యిందని, లేదంటే మరింత అభివృద్ధి జరిగేదని తెలిపారు. పక్క నియోజకవర్గంలోనే ఉండే సీఎం కేసీఆర్ సహకారంతో ప్రణాళికబద్ధంగా ఎల్లారెడ్డిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. సేవచేసే భాగ్యం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, నాయకుడు తానాజీరావు ఉన్నారు.