ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 14: సమయమనేదే లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు పని చేసే నిరంతర శ్రామికులు విద్యుత్ కార్మికులు అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో సమ్మె కొనసాగిస్తున్న విద్యుత్ కార్మికులకు ఆయన మంగళవారం మద్దతు ప్రకటించారు. వారితో పాటే ఆందోళనలో పాల్గొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ..
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి, వారి కష్టాలు తొలగించామని గుర్తు చేశారు. కానీ, బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. విద్యుత్ సిబ్బంది, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభు త్వం వెంటనే నెరవేర్చాలన్నారు. అప్పటి వరకు సమ్మెలో ఉన్న కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెన్నంటే ఉంటారన్నారు. న్యాయపరమైన హక్కుల సాధనకు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకొని శ్రమకు తగ్గ ఫలితాన్ని అందించినట్లు జాజాల గుర్తు చేశారు.
మీ కష్టాలకు అండగా నేనున్నానంటూ మద్దతు ప్రకటించి సమ్మెకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు జాయింట్ యాక్షన్ కమిటీ డివిజన్ సెక్రెటరీ విజయ్‌కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేశారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ విద్యుత్‌శాఖ సిబ్బంది, కార్మికులకు మద్దతు తెలిపి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి, కేసీఆర్ సీఎంగా ఉంటే తమకు సమ్మె చేసే పరిస్థితి రాకుండా చూసుకునే వారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్‌కుమార్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముదాం సాయి లు, నాయకులు నాగం సురేందర్, అబ్దుల్ అలీ, గంగారెడ్డి, పాల్దె నారాయణ, రాజేందర్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.