రాష్ట్ర సమితికి ఎన్నికల సంఘం భారత రాష్ట్ర సమితిగా గుర్తింపు ఇవ్వడంతో దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గాంధేయ మార్గంలో రాజ్యాంగ ప్రక్రియ ద్వారా నూతన రాష్ట్రం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చాలా తక్కువ కాలంలో ఉన్న వనరులను గరిష్ఠంగా క్రమపద్ధతుల్లో ఉపయోగించుకుంటూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ రాజకీయ చతురతకు, పరిపాలనా దక్షతకు, దార్శనికతకు రాష్ట్ర ప్రగతి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నుంచి విరామం లేని విద్యుత్ సరఫరా ఎలా చేయవచ్చో దేశ ప్రజలందరికీ చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శం.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ‘రైతే రాజు’ అని చెప్పడమే కాకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తున్న బాంధవుడు కేసీఆర్. కేసీఆర్ దార్శనికత, నాయకత్వ పటిమ, పరిపాలనా దక్షత చూసి అనేకమంది దేశ నాయకులు, అధికారులు, వివిధ సంఘాలు దేశ రాజకీయాలకు రావాలని చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో అన్నిరకాల అభివృద్ధి తర్వాత దేశ రాజకీయాలకు రావాలని నిర్ణయించుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు శ్రీకారం చుట్టారు.
‘తెలంగాణ మోడల్’ను దేశవ్యాప్తంగా విస్తరించి దేశాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథాన్ని ప్రకటించారు. కులం, మతం మీద జరుగుతున్న రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడడం కోసం పోరాడుతానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ అనేక సందర్భాల్లో ఈ దేశానికి ఇప్పటి వరకు జరిగిన అన్యాయం, తాను ఏ లక్ష్యాలతో దేశ రాజకీయ ప్రవేశం చేయాలని అనుకుంటున్నారో, ఎలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ఈ దేశ ప్రజలకు తెలియజేశారు.