ఎండాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో సాగునీటి కటకట మొదలైంది. భూగర్భ జలమట్టాలు పడిపోతుండడంతోపాటు ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపులో వేగం లేక ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. దీంతో వరి సాగుచేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ ఉల్టా అయ్యింది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరాఫరా లేకపోవడంతో పొలాలు ఎండుతున్నాయి. మాచారెడ్డి మండలంలోని కాకులగుట్టతండా గ్రామానికి చెందిన విస్లావత్ భాస్కర్ రెండెకరాల్లో వరి వేశాడు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5గంటల వరకు కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ కరెంట్ ఎప్పుడుంటదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి. దీంతో పొలమంతా పారక ఒక భాగం ఎండిపోతున్నదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏటా తనకు 70 కింటాళ్ల దిగుబడి వచ్చేదని, ఈ యాసంగి పరిస్థితి చూస్తే 20 క్వింటాళ్ల ధాన్యం కూడా చేతికి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఒక్క గుంటకూడా బీడు పెట్టకుండా రైతులంతా ధైర్యంగా పంటలు సాగుచేశారు. ఈ యాసంగిలోనూ సాగు విస్తీర్ణం భారీగానే ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి చూస్తుంటే చివరి తడికి నీళ్లు అందుతాయా? లేదా? అన్న సందేహంతో రైతులు దిగులు చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 5లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, 3.5లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 90వేల ఎకరాలు కాగా, రెట్టింపు స్థాయిలో వరి సాగైంది.
నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో 81 ఫిజో మీటర్లు ఉన్నాయి. 10 మీటర్ల కన్నా తక్కువ లోతులో నీరున్న ప్రాంతాలను 49గా గుర్తించారు. 10 నుంచి 15 మీటర్ల మధ్యలో 17 ప్రాంతాలు, 15- 20 మీటర్ల మధ్యలో 11 ప్రాంతాలు, 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరున్నవి 4 ప్రాంతాలున్నట్లుగా తేల్చారు. భీంగల్ మండలంలో పరిస్థితి దారుణంగా ఉంది. గోన్గొప్పులలో నీటిమట్టం 26.83 మీటర్ల లోతుకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 21.12 మీటర్లు ఉండగా ఈసారి మరింతగా తగ్గింది. 2023 ప్రారంభంలో జిల్లా సగటు నీటిమట్టం 8.91 మీటర్లుగా ఉన్నది. ప్రస్తుతం 10.06 మీటర్లకు చేరి రెండు మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. నిజామాబాద్ నార్త్ మండలంలోని కంఠేశ్వర్ ఏరియాలో గతేడాది 18.97 మీటర్లు ఉండగా, ఇప్పుడు 21మీటర్లకు చేరింది. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 21.22 మీటర్లకు పడి పోయింది. చలికాలం ముగియక ముందే భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రైతన్నలను భయం వెంటాడుతున్నది. ఇప్పుడే ఇట్లుంటే పొలాలకు నీళ్లు పారించేదెట్లా? పంట చేతికొచ్చేదెట్లా.. అనే ఆందోళనలో ఉన్నారు.
తలాపున శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ బాల్కొండ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు సాగు నీరు అందని దీనావస్థ నెలకొన్నది. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 35.039 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. సరాసరి ఔట్ ఫ్లో 6వేల క్యూసెక్కులు కొనసాగుతున్నది. కాకతీయ కెనాల్ ద్వారా నెలన్నర రోజులుగా ఎస్సారెస్పీ జలాలను తరలింస్తుడడంతో బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని రైతన్నల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు. భవిష్యత్తు అంచనాల ప్రకారం నీటిని విడుదల చేయాలని సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహారిస్తుండడంతో రైతన్నలకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఎస్సారెస్పీ జలాలతోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షలాది నల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని చేరవేస్తున్నారు. సాగునీటిని ప్రణాళిక లేకుండా వదిలితే వేసవిలో తాగునీటికి కూడా తిప్పలు ఎదురయ్యే ప్రమాదముంది.
ఉభయ జిల్లాల్లో సాగు పరిస్థితులు ఈ విధంగా ఉంటే పాలకవర్గం మాత్రం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా రైతుల ఊసెత్తడంలేదు. యాసంగిలో పెట్టుబడి సాయం కూడా అరకొరగానే అందింది. డబ్బుల్లేక చాలామంది రైతులు అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనే పంటల సాగులో అడుగు పెట్టిన రైతులకు ఇప్పుడు సాగునీటి కటకట ఎదురవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారీగా దిగుబడులు వస్తాయని ఆశతో ఉన్న వారికి సాగునీరు ఊపిరి పోస్తుందా.. ఉసూరు మనిపిస్తుందా.. అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
సర్కారు మారితే పోచారం చివరి ఆయకట్టు రైతుల పరిస్థితిలో మార్పు వస్తుందేమోనన్న ఆశ పడిన దడిగె సంగయ్యకు నిరాశే మిగిలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకోక పోవడంతో విస్తుపోయాడు. కనీసం సాగునీరు కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యాసంగిలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ శివారులోని రెండెకరాల్లో వరి నాటు వేశాడు. ఎండలు ముదరకముందే పొలంలో ఉన్న బోరు వట్టిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోచారం ఆయకట్టుకు నీరందేలా కాలువలకు మరమ్మతులు చేయిస్తుందేమో అనుకున్నాడు. కానీ అవన్నీ వట్టిమాటలేనని తన పొలం ఎండిపోయేదాకా అర్థం కాలేదు. పెట్టుబడి పూర్తిగా రూ. 40వేలు నష్టపోయానని కంటతడి పెడుతున్నాడు. ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతలను గాలికి వదిలేసిందని మండిపడ్డాడు.
నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామానికి చెందిన గూల దత్తుకు ఐదెకరాల భూమి ఉంది. అందులో రెండు బోర్లు వేసుకున్నాడు. ఆరుతడి పంట జొన్న సాగు చేస్తున్నాడు. మొన్నటిదాకా ఫుల్లుగా పోసిన మోటర్లు.. ఇప్పుడు సతాయి స్తున్నాయి. మార్చి రాకముందే బోర్ల నుంచి నీళ్లు సరిగా రావడంలేదు. ఆరుతడి పంటకే నీరు సరిపోవడంలేదు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అప్పులు గుర్తుకు వస్తున్నాయని దిగులు పడుతూ తెలిపాడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉం టుం దో? తలుచు కుంటేనే భయంగా ఉందని అంటున్నాడు.