కామారెడ్డి, జూలై 16 : ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఉర్దూ భాషను విధ్వంసం చేశారని, నేడు ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉర్దూ వికాసం దిశగా అడుగులు వేస్తున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ అన్నారు. గంగా జమున తహజీబ్ మాదిరిగా తెలంగాణలో మతసామరస్యానికి ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని తెలిపారు. తెలుగుతో సమాన హోదా కల్పించి ఉర్దూ పరిరక్షణ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చేందుకు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు ‘నమస్తే తెలంగాణ’తో ముజీబుద్దీన్ పలు విషయాలను పంచుకున్నారు.
నమస్తే : ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి దక్కడంపై మీ స్పందన ?
ముజీబుద్దీన్ : తెలంగాణ ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. నాకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పడాన్ని గౌవరంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు.
గతంలో ఉర్దూ అకాడమీ ఎలా ఉండేది ?
నిజాం హయాంలో ఉర్దూ భాషకు ప్రత్యేక అధికార హోదా ఉండేది. తర్వాతి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఉర్దూను పట్టించుకోలేదు. ఇప్పు డు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన ప్రాధాన్యత కల్పి స్తూ విధ్వంసమైన ఉర్దూ భాషను వికాసం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగు తర్వాత అత్యధికంగా ఉర్దూ మాట్లాడేవారు ఉండడంతో 1975-76లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్ సంస్థగా ఉర్దూ అకాడమీని ఏర్పాటు చేసింది. విజయవాడ, కర్నూలు, నిజామాబాద్ జిల్లాలో ప్రాంతీయ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఉర్దూ భాషాభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా విధ్వంసానికి పాల్పడ్డారు.
ఉర్దూ భాషకు ఏ విధమైన గుర్తింపు ఉంది
ప్రపంచంలోనే ఉర్దూ భాష ప్రాచీనమైంది. కాంగ్రె స్, టీడీపీలు ముస్లిములను కేవలం ఓటుబ్యాంకు కోసం వాడుకున్నారు. తెలంగాణలో ఉర్దూ వెనుకబడి పోకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఉర్దూ సాహిత్య కార్యక్రమాలకు నిధులు కేటాయించడంతోపాటు కవులు, కళాకారులకు అవార్డులతో ప్రోత్సహిస్తున్నారు. మహనీయుల జ యంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉర్దూ బలోపేతంపై తెలంగాణ సర్కారు పాత్ర ఏంటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో ఉర్దూ అకాడమీ విభజన పూర్తయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీకి సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను ఉర్దూలో నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణ యం తీసుకున్నారు. ఏటా ఉర్దూ ఆకాడమీ కోసం రూ.6కోట్ల 82లక్షల బడ్జెట్ కేటాయించడమే ఇందుకు నిదర్శనం.
ఉర్దూ భాషాభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు?
అకాడమీ ఆధ్వర్యంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల ప్రచురణను పర్యవేక్షించడం, ఉర్దూ కవితలు, నాటకాలు, విమర్శలు, పరిశోధనకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యా ప్తంగా ఉర్దూ కంప్యూటర్ కేంద్రాల ఏర్పాటు, ఉర్దూ మీ డియం విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం.
రాబోయే రోజుల్లో ఉర్దూ అకాడమీ పాత్ర ఎలా ఉండనున్నది?
రాష్ట్రంలో ఉర్దూ భాషను సజీవంగా ఉంచేలా చర్య లు తీసుకుంటాం. అకాడమీ ద్వారా ఇప్పటికే యువతకు ఉద్యోగ, ఉపాధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 90వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లపై ముస్లిం ఉద్యోగార్థుల కోసం జిల్లా కేంద్రాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఉర్దూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా అకాడమీ ఆధ్వర్యంలో అర్హులకు రుణాలు అందజేస్తున్నాం. అకాడమీ ద్వారా గ్రూప్స్‌కు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం.
ఉద్యోగార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నాం. ముస్లిం యువతకు అండగా నిలిచేందుకు ఉపాధి కల్పించేందకు వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తున్నాం.