కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 28: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 5 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పరీక్షలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలో 57, కామారెడ్డిలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 36,222 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ఇంటర్ జిల్లా విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 15,053 మం ది, ఒకేషనల్ విద్యార్థులు 2736 మొత్తం 17,789 విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ రెగ్యులర్ 13,944 మంది, ప్రైవేట్ 2126 మంది, ఒకేషనల్ రెండవ సంవత్సరం రెగ్యులర్ 2042 మంది, ప్రైవేట్ 319 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 18,469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో జనరల్,ఒకేషనల్కు సంబంధించి ప్రథమ సంవత్సరం 8,743 మంది, ద్వితీయ సంవత్సరం 9,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, తొమ్మిది మంది అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఆరుగురు సిట్టింగ్ స్కాడ్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. సుమారు 800 మంది పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. వీరితోపాటు రెవెన్యూ, పోలీస్, వైద్య విభాగం ఇతర విభాగాల నుంచి పరీక్ష నిర్వహణలో పాల్గొంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
వేసవి దృష్టిలో ఉంచుకొని ఇంటర్ జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. విద్యార్థులకు తాగునీరు, వైద్య సిబ్బంది, పార్కింగ్ వసతి, వాష్ రూమ్స్, ఫ్యాన్ సౌకర్యం, రాత బల్లలు, విద్యుత్ సౌకర్యాలు కల్పించనున్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయనున్నారు. జిరాక్స్ సెంటర్ల మూసివేయనున్నారు. పరీక్షా హాలులోకి అరగంట ముందు విద్యార్థులను అనుమతిస్తారు. ఉదయం 8.30 గంటల్లోపు పరీక్షా కేంద్రంలో ఉండాలి.
ఉదయం 8 నుంచి 8.45 గంటల్లోగా విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో తమ సీట్లలో కూర్చోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం 8 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ విద్యా శాఖ అధికారులు సూచిస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షాకేద్రంలోకి అనుమతించబోం. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి.
-షేక్ సలాం, కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి