ఖలీల్వాడి, జూన్ 16 : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలవగా నిజామాబాద్ జిల్లాలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. సెకండియర్ (జనరల్)లో మొత్తం 6,497 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 3733 మంది ఉత్తీర్ణత (57.46 శాతం) సాధించారని పేర్కొన్నారు. వొకేషనల్లో మొత్తం 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 503 మంది ఉత్తీర్ణులయ్యారని (55 శాతం) తెలిపారు.
మొదటి సంవత్సరం (జనరల్) 10,098 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 5,851 మంది పాసయ్యారని (58 శాతం ఉత్తీర్ణత) తెలిపారు. వొకేషనల్ మొదటి సంవత్సరంలో 1420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 903 మంది పాసైనట్లు (63.59 శాతం) పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 20వ స్థానంలో, మొదటి సంవత్సరం ఫలితాల్లో 26 వ స్థానంలో నిలిచిందని వివరించారు. రీవాల్యుయేషన్, వెరిఫికేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈనెల 17 నుంచి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.