నిజామాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెంది న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అమాత్య యోగం లభించేదెవరికి అన్నది చర్చనీయాంశమైంది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారా? విధేయతకు పట్టం పడతారా? అన్న దానిపై అధికార పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇటీవల ఢిల్లీ కేంద్రంగా జరిగిన సమావేశాలు, జోరుగా సాగుతున్న పైరవీలు.. వెరసి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనుందనే భావన విస్తృతంగా నెలకొన్నది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి (ఉమ్మడి జిల్లా)కి చెందిన వారిలో ఒకరికి బెర్త్ ఖాయంగా కనిపిస్తున్నది. రెండు జిల్లాల్లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఎవరికి చాన్స్ దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టెన్షన్.. టెన్షన్
కాంగ్రెస్ గద్దెనెక్కాక మంత్రిమండలిలో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన షబ్బీర్ అలీకి కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రభుత్వ సలహాదారు, నలుగురికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు మినహాయిస్తే పెద్దగా ప్రాతినిధ్యం లభించలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణపైనే అందరి దృష్టి నెలకొంది. మరోవైపు, ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వారితో పాటు పార్టీ సీనియర్లు ఒకరిద్దరు సైతం కేబినెట్లో అవకాశం కల్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
సీనియర్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పోటీలో ముందుండగా, మిగిలిన ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ మరోసారి కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. పార్టీలో చివరి క్షణం వరకూ ఏమైనా జరగొచ్చు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో పేరు ఖరారయ్యే వరకు ఆశావహులకు టెన్షన్ తప్పేలా లేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనకే మంత్రి పదవి వస్తుందని సుదర్శన్‌రెడ్డి హంగూ ఆర్భాటాలు ప్రదర్శించారు. కానీ నెలల తరబడి నిరీక్షించాల్సి రావడంతో చివరకు వెనక్కు తగ్గారు.
లోక్‌సభ ఓట్లే గీటురాయి
మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పాటించే ప్రామాణికతలు ఏమిటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీనియారిటీ కోటాలో బోధన్ ఎమ్మెల్యే ముందున్నారు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం సుదర్శన్‌రెడ్డికి మైనస్‌గా మారింది. జహీరాబాద్‌లో కాంగ్రెస్ గెలవడం వల్ల కామారెడ్డి జిల్లాలో కొత్త ఎమ్మెల్యేలకు సానుకూలంగా మారే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్నది. నిజామాబాద్ నుంచి పలు పదవులను ఆశించిన వారికి ఎంపీ ఎన్నికలే వారి పాలిట గుదిబండగా మారాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే పదవులకు గీటురాయి అన్న ప్రచారంతో మంత్రి పదవితో పాటు ఇతర కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వచ్చి, ఎంపీ ఎన్నికల్లో తగ్గడానికి పార్టీ నేతల వైఫల్యమేనని ఏఐసీసీ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉండి కూడా ఎంపీ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లను, సీట్లను దక్కించుకోకపోవడం, గెలుస్తామనుకున్న సీటును బీజేపీ కైవసం చేసుకోవడంపైనా అగ్ర నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జోరుగా ఊహాగానాలు..
సుదీర్ఘ కాలంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టక పోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొంది. మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలిసి వచ్చేందుకే సమయాన్ని వృథా చేస్తున్నారు తప్పితే నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడ ంలేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సుదర్శన్‌రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉండడంతో పాటు రేవంత్‌రెడ్డి బంధువు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం.
సామాజిక సమీకరణలో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం దక్కితే బోధన్ ఎమ్మెల్యేకు అవకాశం కష్టమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల పేర్లు తెర మీదికి రావొచ్చని పేర్కొంటున్నారు. ప్రభుత్వ సలహాదారు పదవితో అంతగా సంతృప్తి చెందని షబ్బీర్ అలీ సైతం మైనార్టీ కోటాలో తనకే చాన్స్ ఇవ్వాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నాయకత్వం ఎవరికి చాన్స్ ఇస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.