పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారాయి ప్రైవేటు దవాఖానలు. కార్పొరేట్ లుక్తో ఏర్పాటవుతున్న దవాఖానాలు.. వసతులు, సౌకర్యాలు, అనుభవలేమి సిబ్బందితో వైద్యం చేయిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. మెరుగైన వైద్యం పేరిట లక్షలు వసూలు చేస్తూ చివరికి మృతదేహాలను అప్పగిస్తున్నారు. తమ నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందినట్లు తేలితే ఆ ప్రాణానికి వెలకట్టి.. మృతుడి కుటుంబీకులకు డబ్బులు పారేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు దవాఖానల్లో రోగులు ప్రాణాలు విడుస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది.
Private Hospitals | నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు దవాఖానలపై వైద్యశాఖ అధికారుల నిఘా కరువైంది. పుట్టగొడుగుల్లా ప్రైవేటు దవాఖానలు వెలుస్తున్నాయి. అర్హత లేకున్నా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీల పేరిట దవాఖాన బోర్డులు దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయలతో దవాఖానలు కట్టి, వాటిని ప్రజల నుంచే వసూలు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వైద్యులు, యాజమాన్యాలు దవాఖానలను ప్రారంభిస్తున్నాయి. దీంతో చిన్న రోగానికి చికిత్స కోసం వెళ్తే దవాఖానలో అడ్మిట్ చేసుకొని లక్షలు దండుకుంటున్నారు. ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు రోగులు నిరుపేదలైనా ఆస్తులు అమ్ముకొని దవాఖానల బిల్లులు కడుతున్నారు. ఆరోగ్యం మాట అటుంచితే దవాఖాన బిల్లులను చూస్తేనే గుండె గుబేల్మంటున్నది. అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా ఇష్టారీతిన గల్లీగల్లీకి ఓ దవాఖాన పుట్టుకొస్తున్నది. నిబంధనలకు పాతర వేస్తూ రోగంతో సంబంధం లేకుండా ప్రతి దానికి పరీక్షలు, స్కానింగ్లు చేస్తూ రోగుల నుంచి వేలాది రూపాయలు గుంజుతున్నారు. దీంతో ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలకు కాసుల పంట పండుతున్నది. చిన్న సమస్యతో ప్రైవేటు దవాఖానకు వెళ్తే తక్కువలో తక్కువ వేలల్లో బిల్లులు వేస్తున్నారు. రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ల్యాబ్లు, మెడికల్ షాపులు ఇలా ప్రతి ఒక్కటీ ప్రైవేటు దవాఖానల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి.
తమ దవాఖానలో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలు ఉన్నాయంటూ ప్రచారాలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలు.. క్షేత్రస్థాయిలో చూస్తే అవేం కనిపించవనే ఆరోపణలు ఉన్నాయి. అర్హతలు లేకున్నా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానలంటూ బోర్డులు ఏర్పాటు చేస్తూ వైద్యం కోసం వస్తున్న రోగుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. సరైన వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతే.. సెటిల్మెంట్ పేరిట డబ్బులు అందించి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సానుభూతి చూపాల్సిన వైద్య సంఘాల నాయకులు పలువురు దవాఖాన యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అందుకోసం ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి దవాఖానలో సౌకర్యాలు, అర్హతలపై బృందం నివేదిక తయారు చేస్తున్నది. డీఎంహెచ్వోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి దవాఖానపై దృష్టి సారించాం. బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధిక డబ్బులు వసూలు చేసే దవాఖానలను సైతం తనిఖీ చేస్తాం.
జిల్లా కేంద్రంలో రెండు నెలల వ్యవధిలో మూడు, నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక ప్రైవేటు దవాఖానలో 10 సంవత్సరాల పిల్లవాడు చేరగా కాలం చెల్లిన ఇంజెక్షన్ వేయడంతో ఆ బాలుడు మరణించాడు. మరోచోట క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారం అపహరణ చేశారు. మరో దవాఖానలో అబార్షన్ చేయబోయి.. మహిళను పొట్టన పెట్టుకున్నారు. మరికొన్ని దవాఖానల్లో బయటికి రాని సం ఘటనలు చాలా ఉన్నాయి. అర్హత, అనుభవం లేని కొంతమంది చేస్తున్న వైద్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రైవేటు యాజమాన్యాలు, దవాఖానలు రోగి ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులెవరూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.