బాల్కొండ/ వేల్పూర్/ ఏర్గట్ల, జనవరి 12 : కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్, బాల్కొండ మండలం నాగపూర్, వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో నిర్మించిన నూతన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అక్లూర్లో అంగన్వాడీ సెంటర్, ఏర్గట్ల మండలం తడ్పాకల్లో పల్లె దవాఖానకు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ప్రభుత్వంలో మంజూరైన పథకాలు, పనులు రద్దు చేయడం సరికాదని, వాటిని అలాగే కొనసాగించాలని అన్నారు. ఆ పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ లెటర్‌హెడ్ మీద మంజూరు చేసినవి కావని పేర్కొన్నారు. ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అఫ్రూవల్‌తో వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు తెలంగాణ ప్రభుత్వం తరపున బాల్కొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం అధికారికంగా మంజూరు చేసినవని వివరించారు.
ప్రజలు, వీడీసీ, కులసంఘాల సభ్యులు మంజూరైన పనుల ప్రారంభం కోసం ఆశతో ఉన్నారని తెలిపారు. స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ పనులు కొనసాగించేలా చూడాలని, ఆ పనుల క్రెడిట్ కూడా వారే తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. గతంలో వివిధ శాఖల ద్వారా తాను మంజూరుచేసి తీసుకువచ్చిన రోడ్లు, బ్రిడ్జిలు, చెక్‌డ్యామ్‌లు, కులసంఘాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులను రద్దు చేయకుండా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు- భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డిని ప్రజల తరఫున కోరుతున్నట్లు పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో స్థలం ఉండి, సొంతిల్లు లేని ఆరు వేల మందికి గృహలక్ష్మి కింద ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల చొప్పున మంజూ రు చేశామన్నారు. ఏ పార్టీ, ఏ వర్గం అనేది చూడకుండా సమ దృష్టితో వీరందరి ఎంపిక జరిగిందని తెలిపారు. వీరందరికీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇచ్చి వారికి సొంతిల్లు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.