నిజాంసాగర్, అక్టోబర్ 7: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వరద వచ్చిచేరింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సుమారు 50 రోజుల వ్యవధిలోనే 273.09 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. వందేండ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. మంజీరా నదిపై నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో నిజాంకాలంలో 1931లో నిర్మించిన ఈ ప్రాజెక్టులోకి కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో కురిసే వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతున్నది.
ప్రాజెక్టులోకి ఎగువప్రాంతం నుంచి ఆగస్టులో 78.686 టీఎంసీలు, సెప్టెంబర్లో 138.300, అక్టోబర్లో 56.104 టీఎంసీలు వచ్చింది. మూడు నెలల్లో మొత్తం 50 రోజుల పాటు 273.09 టీఎంసీలు ఇన్ఫ్లోగా వచ్చి చేరింది. అక్టోబర్ 7న సాయంత్రం నాటికి 256.099 టీఎంసీల నీటిని మంజీరాకు విడుదల చేశారు. వందేండ్ల చరిత్ర ఉన్న ప్రాజెక్టు నుంచి ఇంత భారీ స్థాయిలో ఇన్ఫ్లోగా రావడం, నీటిని మంజీరాలోకి విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతకుముందు 1983 సంవత్సరంలో భారీ వర్షాలు కురవడంతో 163 టీఎంసీల వరద వచ్చింది. తర్వాత ఈ స్థాయికి మించి వరదలు రావడం ఇదే తొలిసారి. 1962 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. ఒకేసారి 4.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 1988లో 2 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆ తర్వాత ఎప్పుడూ ఒక రోజులో గరిష్ఠంగా ఇన్ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఈసారి ఆగస్టు 28వ తేదీన 2.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది.
మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా రావడంతో ఆగస్టు 18 నుంచి వరద గేట్ల ద్వారా నిర్విరామంగా 50 రోజులుగా నీటి విడుదల కొనసాగుతున్నది. ఇప్పటివరకు 256.099 టీఎంసీలు ఇన్ఫ్లోగా ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. వందేండ్ల చరిత్రలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇంత భారీ స్థాయిలో ఇన్ఫ్లో రావడం ఇదే మొదటి సారి.
-సొలోమాన్, నీటి పారుదల శాఖ ఈఈ నిజాంసాగర్