మోర్తాడ్/నాగిరెడ్డిపేట/ ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 19: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్‌ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి మంగళవారం ఎగువప్రాంతం నుంచి 2.75లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి మరో రెండడుగుల దూ రంలో మాత్రమే ఉన్నది.
భారీగా వరద రావడంతో ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తి దిగువ గోదావరికి 3.25లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి 3,53, 867 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎస్కేప్గేట్ల ద్వారా గోదావరిలోకి 3300, వరదకాలువకు 20వేలు, కాకతీయ కాలువకు 4700, మిషన్‌భగీరథకు 231క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 636 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1089 డుగుల(73.37టీఎంసీలు) నీటినిలువ ఉన్నది.
వరదకాలువకు 20వేల క్యూసెక్కులు, గోదావరిలోకి 3.25లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో గోదావరి, వరదకాలువ పరిసరప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు వచ్చే ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతిని నిరంతరం పర్యవేక్షించాలని, విడుదల చేస్తున్న నీటి కారణంగా గోదావరి, వరదకాలువ, కాకతీయకాలువ ఉన్న గ్రా మాల ప్ర జలను అప్రమత్తం చేయాలని సూచించారు.
పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాన్సువాడ (నిజాంసాగర్), ఆగస్టు 19: ఎగువ ప్రాంతం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని నీటి పారుదల శాఖ ఏఈ సాకేత్ మంగళవారం తెలిపారు. దీంతో నీటి విడుదల కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 1405 అడుగులు ( 17. 802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1403 అడుగుల (15.902 టీఎంసీలు) నీరు ఉన్నదని తెలిపారు. ప్రాజెక్టు 16 గేట్ల ద్వారా 88 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి వాగులోకి వరదనీరు భారీగా చేరుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఐదు రేడియల్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్ట్‌లోకి 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతే నీటిని రేడియల్ గేట్ల ద్వారా మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 408.30 మీటర్ల మేర నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. లింగంపేట పెద్ద వాగు, గుండారం వాగుల ద్వారా 6,740 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతుండడంతో పొంగిపొర్లుతూ దిగువకు వెళ్తున్నది.నాలుగరోజుల్లో ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరినట్లు నీటి పారుదల శాఖ డీఈఈ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా కేవలం 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.