Indiramma indlu | శక్కర్ నగర్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి పనులు జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. శుక్రవారం బోధన్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీఓ అధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు.
ముందుగా బోధన్ మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం లేకుండా పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు వారికి ఉన్న ఖాళీ స్థలాల్లో ముగ్గు వేయించి పనులు ప్రారంభానికి అవగాహన కల్పించి, ప్రభుత్వపరంగా ఇంటి నిర్మాణానికి గాను దశలవారీగా అందే బిల్లుల విషయంలో సమాచారం అందించాలని అన్నారు.
అనంతరం బోధన్ మండలంలో యువతకు స్వయం ఉపాధిలో భాగంగా రాజీవ్ యువశక్తి పథకానికి గాను దరఖాస్తు చేసుకున్న యువకుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అర్హుల ఎంపిక జాబితాలో పారదర్శకత వహించాలని అన్నారు. జూన్ 5 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేసే విషయంలో మండలంలోని గ్రామాల వారిగా మహిళా సంఘాలకు చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలగంగాధర్ ఎంపీఓ మధుకర్ ఉన్నారు.