మోర్తాడ్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొన్నది. అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇండ్లు లేనివారిని, ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చిన వారిని ఎంపిక చేయకుండా, ఇండ్లు ఉన్నవారిని ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగాపూర్ గ్రామంలో 84 కుటుంబాలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశారు.
ఇందులో దాదాపు ఇండ్లు లేని వారు, ఇండ్లు అవసరం ఉన్నవారందరూ ఉన్నారు. కానీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో చాలా పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఇండ్లు లేక ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు ఉన్నవారిని మొదటి జాబితాలో కాకుండా మూడో జాబితాలో ఎంపిక చేశారు. ఏండ్ల తరబడి అద్దెకు ఉంటూ ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న తమలాంటి వారిని మూడో జాబితాలో ఎంపిక చేయడంపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపికలో లోపాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మొదటి జాబితాలో ఎంపికైన లబ్ధిదారులు ఇండ్లు కట్టడానికి ముందుకురావడం లేదు. ఇప్పటికే ఎంపీడీవో పలుమార్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి నిర్మాణాలు చేపట్టాలని, డబ్బులు లేకపోతే మహిళాసంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పడం, ఇండ్లు కట్టుకునేందుకు ముందుకు రాకపోతే అనర్హులుగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఇండ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే ఎలా అనే అనుమానాలు వ్యక్తంచేస్తూ ఇండ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలిసింది.
1999లో అప్పటి ప్రభుత్వం గ్రామంల 32 మందికి ఇండ్ల స్థలాలను కేటాయించింది. ఒక్కొక్కరికీ 150గజాల స్థలాన్ని కేటాయించి, అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను కూడా అందజేశారు.ఇందులో ఆర్థిక పరిస్థితి బాగోలేక చాలా మంది ఇండ్లు కట్టుకోలేదు. అలాంటివారికి స్థలాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. దీంతో చేసేదేమీ లేక తమకు ఇండ్ల స్థలం చూపించాలని ప్రభుత్వం ఇచ్చిన ధ్రువపత్రాలను పట్టుకుని ఏండ్ల తరబడి అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది.
నర్సరీని ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్థలంలోనైనా ఏర్పాటు చేయవచ్చు. కానీ పేదలకు కేటాయించిన ప్లాట్లలో నర్సరీని ఏర్పాటు చేయడంతో ఏం చేయాలో తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలోనైనా తమకు న్యాయం జరగుతుందన్న ఆశతో ఉన్న వారికి నిరాశే ఎదురయ్యింది. నర్సరీని తొలగించి తమ స్థలాలు చూపిస్తే ఇండ్ల కట్టుకుంటామని, ఇప్పటికైనా తమ స్థలాలను చూపించాలని అధికారులను కోరుతున్నారు.
చెడబోయిన లక్ష్మి విషయం మా దృష్టికి వచ్చింది. వారు అద్దెకు ఉంటున్న ఇల్లు దాబా ఇల్లు కావడం అదే విషయాన్ని యాప్‌లో ఫీడ్ చేయడంతో వారిపేరు మూడో లిస్ట్‌లోకి వెళ్లింది. ఈవిషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అటువంటి వారు ఉంటే వారందరిని మొదటిలిస్ట్లో చేరుస్తాం. స్థలం మాత్రం రెవెన్యూ అధికారులు చూపించాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకత వహించాం.
-రాజశ్రీనివాస్, ఎంపీడీవో, కమ్మర్పల్లి
మాకు సొంతిల్లు లేదు. ఏండ్ల తరబడి మేం కిరాయి ఇంట్లో ఉంటున్నం. బాకీలవడంతో నాభర్త వేరే దేశానికి పోయిండు. బాకీలు తీరినయి కదా ఇల్లుకట్టుకుందమనుకుంటున్నం. మాకు గవర్నమెంట్ ఇచ్చిన జాగ చూపించాలని తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. మేం కిరాయికి ఉంటున్న ఇల్లు దాబా ఇల్లు కావడంతో మా పేరు మూడో లిస్టులో వేసిండ్రని చెప్తుండ్రు. మా జాగా మాకు చూపించి మమ్మల్ని మొదటిలిస్ట్లో చేరిస్తే వెంటనే మేం ఇల్లు కట్టుకుంటం.
-చెడబోయిన లక్ష్మి, నాగాపూర్