దేశంలో పది అత్యుత్తమ గ్రామాలు మన తెలంగాణవే..
రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి గ్రామానికి రూ.కోటి వరకు నిధులు
మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి పశాంత్రెడ్డి
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు
ఖలీల్‌వాడి, మే 30 : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని, ఇందుకు కేంద్ర ప్రభు త్వం ఇటీవల నిర్వహించిన సర్వేనే తార్కాణమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వచ్చే నెల 3 నుంచి ప ల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్న నేప థ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద దేశంలో ఎంపికైన టాప్10లో పది గ్రామాలు తెలంగాణకు చెందినవే ఉండడం విశేషమన్నారు. దేశంలోనే టాప్ 10లో నిలిచిన గ్రామాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పాల్దా, వెల్మల్, ఠాణాకుర్దు, కుకునూర్, కందకుర్తి గ్రామాలు ఉండడం గర్వకారణమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.
దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నా రు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల నిర్వహణకే సరిపోతున్నాయని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధుల లేమి లోటును భర్తీ చేస్తోందన్నారు. కేంద్రం అందిస్తున్న నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు అంతే మొత్తంలో నిధులు సమకూరుస్తుందని తెలిపారు. ఫలితంగానే అన్ని పల్లెల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్ర సర్వే ద్వారా రుజువైందన్నారు. ఇప్పటివరకు ఒక్క నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలకే రాష్ట్ర ప్రభుత్వం రూ. 485కోట్ల పైచిలుకు నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు. సగటున ఒక్కో గ్రామానికి సుమారు రూ. కోటి చొప్పున నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమకూరాయన్నారు. వీటితో పాటు ఉపాధిహామీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.400 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ మరిన్ని సత్ఫలితాలు సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ నిర్దేశిత కార్యక్రమాలు వంద శాతం అమలయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనంలో ప్రపంచంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల వద్ద వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ రాజేశ్వర్ సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. అప్పట్లో అశోకుడు చెట్లు నాటించినట్లు విన్నామని, ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని అన్నారు. పచ్చదనంలో ప్రపంచంలో తెలంగాణకు మూడోస్థానం రావడం సీఎం కేసీఆర్ ఘనతే అని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో స్వచ్ఛ గ్రామాలుగా మారాయని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో నగర మేయర్ నీతూకిరణ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, రెడ్కో చైర్మన్ అలీం, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీఎఫ్‌వో సునీల్, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, మున్సిపల్ చైర్పర్సన్లు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.