నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 25: యుద్ధవాతావరణం అలుముకున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న జిల్లావాసుల సమాచారం, వివరాలను పోలీసుశాఖకు అందజేయాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కే ఆర్ నాగరాజు సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన వారు ఎవరైనా ఉక్రెయిన్‌లో ఉంటే వారి కుటుంబ సభ్యులు పూర్తి వివరాలను పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో నమోదు చేయించాలని లేదా 94913 98540 నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలను అందజేయాలని సూచించారు. పేరు, వయస్సు, అక్కడ ఏ ప్రాంతంలో ఉంటున్నారో పూర్తి అడ్రస్, అక్కడి విద్యాసంస్థ పేరు, ఫోన్ నంబర్, మన దేశంలోని ఫోన్ నంబర్‌తోపాటు మెయిల్ ఐడీ అందజేయాలని తెలిపారు. వాటి ద్వారా వారు ఎలా ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుంటామని సీపీ పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి ఫిబ్రవరి 25: ఉక్రెయిన్, రష్యా దేశాల్లో జిల్లాకు చెందిన 14 మంది ఉన్నారని సీసీ నాగరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్లకు వచ్చిన సమాచారం మేరకు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే సమీప పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 25: కామారెడ్డి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లో ఆరుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గాంధారి మండలం వెంకటాపూర్తండాకు చెందిన కేతావత్ రాహుల్, బీబీపేట మండల కేంద్రానికి చెందిన బాచ హరిప్రియ, నస్రుల్లాబాద్ మండలానికి చెందిన సచిన్‌గౌడ్, సలావత్ సాయి చరణ్, జిల్లా కేంద్రానికి చెందిన పెండ్యాల అన్వేశ్, మామిడాల విష్ణు కౌండిన్య ఉన్నారు. వీరంతా యుద్ధం జరిగే ప్రాంతాలకు దూరంగా ఉన్నారని, వీరిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
భీమ్‌గల్, ఫిబ్రవరి 25 : మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలెపు రాజేశ్వర్ కూతురు పాలెపు రుచిత ఉక్రెయిన్‌లో వైద్య విద్య మూడో సంవత్సరం చదువుతోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా వివరించింది. అక్కడ పరిస్థితి చాలా భయానకంగా ఉందని, అధికారుల ఆదేశాల ప్రకారం సైరన్ మోగడంతో బంకర్లకు వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నామని వాపోయింది. తినడానికి నిత్యావసర సరుకులు కూడా లభించని పరిస్థితి నెలకొన్నదని, ఏటీఎంలో డబ్బులు కూడా రావడం లేదని తెలిపింది.
బాల్కొండ, ఫిబ్రవరి 25: మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన ద్యాగ దివ్య ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. గ్రామానికి చెందిన ద్యాగ నర్సయ్య-రాజమణి దంపతుల కూతురైన దివ్య ఐదేండ్ల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లి వైద్యవిద్య చదువుతోంది. అక్కడి భయానక పరిస్థితులను ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా వివరించింది. ఈ సమయంలో కూడా యూనివర్సిటీ వారు ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటున్నారని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దివ్య తండ్రి నర్సయ్య కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.